ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్
దుండిగల్: ఆరేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో ఏ ఒక్కటీ టీఆర్‌ఎస్ ప్రభు త్వం అమలు చేయలేదని, అందుకు నిదర్శనమే డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటింటికీ తాగునీరు, రైతు రుణమాఫీ అని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో కేసీఆర్, ఢిల్లీలో మోదీలను ఎదిరించి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. భౌరంపేటలో సర్వే నంబరు 166లో 150 మంది రైతుల నుంచి 400 ఎకరాల అసైన్డ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, కానీ ఇప్పటివరకు వారికి పరిహారం అందించడంలో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి మరోసారి మోసపోవద్దని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థులు నవిత, రాముగౌడ్, మహేందర్ యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment