‘గ్రేటర్’ ఆకర్ష్! | TRS eye on hyderabad Congress, TDP Leaders | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ ఆకర్ష్!

Published Fri, Jun 27 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

‘గ్రేటర్’ ఆకర్ష్!

‘గ్రేటర్’ ఆకర్ష్!

* దానం, ముఖేష్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు టీఆర్‌ఎస్ గాలం
* ఆయా నేతలతో హరీశ్‌రావు రహస్య మంతనాలు  
* కాంగ్రెస్‌లోనే ఉంటామన్న దానం, సుధీర్!
 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్ ‘గ్రేట్’ ఆకర్ష్‌ను ప్రారంభించింది. శాసనమండలిలో ఆధిపత్యం కోసం ప్రయోగించిన అస్త్రం పూర్తిగా విజయవంతం కావడంతో.. ఇప్పుడు కీలకమైన రాజధానిపై కన్నేసింది. మరో ఆరు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఇక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే యోచనతో పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఆయా నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

రాజధానిలో పార్టీ కొంత బలహీనంగా ఉండటం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే నేపథ్యంలో.. ఇక్కడ సంస్థాగతంగా పట్టున్న ఇతర పార్టీల నేతలపై ‘ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగించే పనిలో టీఆర్‌ఎస్ నిమగ్నమైంది. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా బలహీనపర్చడమనే ద్వి ముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

ఇందులో భాగంగా హరీశ్‌రావు కొద్దిరోజులుగా మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డిలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని, టీఆర్‌ఎస్‌లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఆయా నేతలకు రకరకాల తాయిలాలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్.కృష్ణయ్య టీఆర్‌ఎస్‌లో చేరితే మెదక్ ఎంపీ సీటిచ్చి గెలిపించుకుంటామని.. ఒకవేళ ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య పార్టీలోకి వస్తే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని దింపి గెలిపించుకోవచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. సుధీర్‌రెడ్డితో చర్చల సందర్భంగా హరీశ్‌రావు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో హుడా చైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డిపై గతంలో ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వాటిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేతలు కొందరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగితే టీఆర్‌ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశముందని, అదేదో గులాబీ జెండా కప్పుకుంటే మేలని సుధీర్‌రెడ్డిపై ఆయన సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి దానం నాగేందర్‌పై కూడా ఇదే తరహాలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. దానంపై అనేక భూఅక్రమణ ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దాంతో టీఆర్‌ఎస్‌లో చేరితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, పైగా గ్రేటర్‌పై తన ముద్ర వేయవచ్చని దానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్‌తో చర్చల సందర్భంగా దానం పలు ప్యాకేజీలను డిమాండ్ చేయడంతో వాటిపై టీఆర్‌ఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం.

మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌తోనూ టీఆర్‌ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. తన కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలని భావిస్తున్న ముఖేష్ గత ఎన్నికల్లో తన కుమారుడికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరితే గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్‌గౌడ్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఆయా నేతల తో ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
 
కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం: దానం, సుధీర్‌రెడ్డి
దానం, సుధీర్‌రెడ్డి సహా పలువురు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ కొన్నిచానళ్లలో వార్తలు రావడంతో.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయా నేతలతో గాంధీభవన్‌లో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం దానం, సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీఆర్‌ఎస్‌లోకి రమ్మని ఆ పార్టీ నేత లు మీతో మాట్లాడారా? లేదా? అని విలేకరులు ప్రశ్నిం చినా.. వారు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆర్.కృష్ణయ్య సైతం తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని పేర్కొన్నారు.
 
నాయకత్వ లోపంవల్లే: జానారెడ్డి, జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజల ముందుంచలేకపోయామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సైతం జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిం చారు.  హైకమాండ్ హడావుడి నిర్ణయంతో లోపం జరిగిందని, అదే ఇప్పుడు గుణపాఠమైందన్నారు. త్వరలో హైకమాండ్‌తో సమీక్షించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement