సాక్షి, నల్లగొండ : పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమ నేత కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అనూప్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ రాధ, పార్టీ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్యలు ఆరోపించారు.
శనివారం కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 ఏళ్లుగా కోమటిరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. కోమటిరెడ్డి వేయించిన సీసీ రోడ్లమీద నడుచుకుంటూ ప్రచారం చేస్తూ అభివృద్ధి చేయలేదని అసత్య ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి కళ్లముందే కనబడుతున్నా కళ్లు లేని కబోదుల్లా అబద్ధపు ప్రచారాన్ని చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
సబ్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి..
ఓల్టేజీ సమస్యతో రైతుల మోటార్లు కాలిపోయి, పొలాలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే దాన్ని పరిష్కరించేందుకు కోమటిరెడ్డి రెండు గ్రామాలకు ఒక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లతోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను సాధించింది కోమటిరెడ్డి కాదా అని ప్రశ్నించారు.
అపర భగీరథుడు వెంకట్‌రెడ్డి
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి 610 గ్రామాలకు తాగునీరు అందించిన అపర భగీరథుడు వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మ బలిదా నం చేసుకుంటుంటే తట్టుకోలేక మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదిలేసి పదిరోజుల పాటు తెలంగాణ కోసం గడియారం సెంటర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు.
పానగల్ రోడ్డులోని రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జి, అండర్‌గ్రౌండ్ డ్రైయినేజీ, కోమటిరెడ్డి ప్రతీక్ పేరుమీద రూ.10 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించి విద్యార్థుల చదువులకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి నీటిట్యాంక్, రోడ్లు, బ్రిడ్జిలు అన్నీ కోమటిరెడ్డి హయాంలో జరిగినవేనన్నారు. అభివృద్ధి చేశాడు కాబ ట్టే ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు.
కోమటిరెడ్డిని అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని, ప్రజలంతా కోమటిరెడ్డి వెంటే ఉన్నారన్నారు. సోమవారం కోమటిరెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించే బైక్‌ర్యాలీలో కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు. అనంతరం కోమటిరెడ్డి చేసిన అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అల్లి సుభాష్, సమి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment