సాక్షి, వనపర్తి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలోనే మొదటిదైన మత్స్య కళాశాల భవన నిర్మాణ పనులకు పెబ్బేరులో సోమవారం నాడు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అద్దె భవనంలో తరగతులను ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటు ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే భావనతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తుందన్నారు. గడిచిన సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను, ఈ ఏడాది 51 కోట్ల చేపపిల్లల విత్తనాలను ఉచితంగా అందజేశామన్నారు. రాష్ట్రంలో జలవనరులు అధికంగా ఉన్నాయని వీటికి తోడు నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయితే నీరు నిల్వ ఉండే ప్రాంతం పెరుగుతుందని, దీనికితోడు చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ వల్ల కూడా నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో చేపల సరఫరాలో రాష్ట్రం ముందంజలో ఉండాలనే సంకల్పంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ రంగంలో పరిశోధనలు పెరగాలని మత్స్య కళాశాలను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఈ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుందని మీకు కోర్సు పూర్తి కాగానే మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అన్నారు.
ఈ ప్రాంత ప్రజల అదృష్టం..
మత్స్య కళాశాల వనపర్తి జిల్లాకు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. కళాశాల భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసిందని ఏడాదిలోగా పనులు పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పశు సంవర్ధక శాఖ కళాశాల సంచాలకులు వెంకటేశ్వర్లు, గొ ర్రెలు, మేకల సహకార సంఘం రాష్ట్ర ఎండీ లక్ష్మారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావు, ఆర్డీఓ చంద్రారెడ్డి, కళాశాల డీన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రవికుమార్, బుచ్చారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, పెబ్బేరు సర్పంచ్ సుశీల, ఎంపీపీ పద్మావతి పాల్గొన్నారు.
వారివి అర్థం లేని మాటలు..
పెద్దమందడి (ఖిల్లాఘనపురం): కాంగ్రెస్ దొంగలంతా అచ్చంపేటలో కలిసి బీసీలకు ఏం చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటని తెలంగాణ మంత్రి తలసాని అన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరులో రూ.16 లక్షలతో నిర్మించిన పశువైద్య ఆరోగ్య కేంద్రం నూతన భవనం, రూ.13 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదిని నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల అభివృద్ధికి, కులవృత్తుల ప్రోత్సాహానికి చేపడుతున్న పథకాలతో తాము ఎక్కడ ఉనికి కోల్పోతామోనని మాట్లాడుతున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లాలో 198 గొర్రెల సహకార సంఘాలు ఉండగా సభ్యులకు 29.50 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దయాకర్, జెడ్పీటీసీ సభ్యుడు జేడీ విజయరామారావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, మండల పశువైద్యాధికారి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment