కర్నె ప్రభాకర్‌కు కలిసొచ్చిన అదృష్టం
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ కాబోతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
చౌటుప్పల్ : మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ కాబోతున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కర్నె ప్రభాకర్ పార్టీలో కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లోనూ మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది.
అయినా కర్నె ప్రభాకర్ నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేశారు. ముందు నుంచీ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని చెప్పారు. కర్నె ప్రభాకర్ స్వస్థలం సంస్థాన్ నారాయణపురం. తండ్రి జంగప్ప ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కర్నెప్రభాకర్ ప్రాథమిక విద్యాభ్యాసం సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ఇక్కడే పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో చదివారు. అనంతరం జర్నలిజం కూడా చేశారు. కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ అవుతున్నారని తెలియడంతో సంస్థాన్ నారాయణపురంలో బుధవారం రాత్రి బాణసంచా కాల్చి, హర్షం వ్యక్తం చేశారు.