స్ఫూర్తి యాత్ర టెన్షన్‌.. టెన్షన్‌ | TRS leaders blocking Kodandaram | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి యాత్ర టెన్షన్‌.. టెన్షన్‌

Published Sat, Aug 12 2017 1:36 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

స్ఫూర్తి యాత్ర టెన్షన్‌.. టెన్షన్‌

స్ఫూర్తి యాత్ర టెన్షన్‌.. టెన్షన్‌

 కోదండరాంను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు
► భిక్కనూరులో అరెస్టు.. సాయంత్రం హైదరాబాద్‌కు తరలింపు
► కామారెడ్డిలో జేఏసీ వేదిక వద్ద రణరంగం
► అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అడ్డంకులు: కోదండరాం
►  నేడు మళ్లీ యాత్ర కొనసాగిస్తానని స్పష్టీకరణ


సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు.

అక్కడ్నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ వద్దకు యాత్ర చేరుకోగానే అధికార పార్టీ నేతలు అడ్డు తగిలారు. అక్కడ్నుంచి కోదండరాంను పోలీసులు ముందుకు పంపించగా భిక్కనూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన తర్వాత కామారెడ్డి వైపు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు కోదండరాంతోపాటు జేఏసీ నేతలను అరెస్టు చేసి భిక్కనూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోదండరాంను బలవంతంగా జీపులో ఎక్కించి హైదరాబాద్‌ తరలించారు.

టెంట్‌ కూల్చివేత..
కామారెడ్డి మున్సిపాలిటీ ఎదుట జేఏసీ తలపెట్టిన సభావేదిక రణరంగమైంది. వేదిక వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ జేఏసీ నేతలపై దాడికి దిగారు. కొందరు వేదిక టెంట్‌ కూల్చివేయగా, మరికొందరు విద్యార్థి నాయకులను పట్టుకుని చితకబాదారు. ఇందులో పలువురు నాయకులతోపాటు ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలయ్యాయి.

టీఆర్‌ఎస్‌ నేతల తీరును నిరసిస్తూ విద్యార్థి నాయకులు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ నేతలు వారిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో జేఏసీ, విద్యార్థి నేతలు 15 మంది, టీఆర్‌ఎస్‌ నేతలు 15 మంది ఉన్నారు.

సీపీఐ ఖండన
టీజేఏసీ స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ అడ్డుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ–ఎంఎల్‌ న్యూ డెమో క్రసీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు ఖండించారు. ఇలాంటి నియంతృత్వ పోక డలు మంచివి కావని చాడ హెచ్చరించారు.

అడ్డుకుంటే టీఆర్‌ఎస్‌కే ముప్పు: కోదండరాం
దాడులకు భయపడేది లేదని, శనివారం కామారెడ్డి జిల్లాలో తన యాత్ర కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టంచేశారు. యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో టీఆర్‌ఎస్‌ నేతలు యాత్రకు అడ్డుపడుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. దాడికి గురైన వారినే అరెస్టు చేయడం, హైదరాబాద్‌ దాకా తీసుకురావడం అన్యాయమన్నారు. ఇలాంటి అప్ర జాస్వామిక వ్యవహార శైలి టీఆర్‌ఎస్‌కే ముప్పు అని హెచ్చరించారు.

అంతకుముందు ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానన్న ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ నేతలు యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బాన్సువాడలో జరిగిన మంజీర ఇసుక అవినీతిని ప్రశ్నిస్తానని మంత్రి పోచారం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, కామారెడ్డిలో భూ దందాలు, అక్రమాలపై ప్రశ్నిస్తానని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లు భయపడి టీఆర్‌ఎస్‌ గుండాలతో దాడులు చేయించారన్నారు. సీఎం ప్రారంభించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రీ ఇంజనీరింగ్‌ అని అసెంబ్లీలో కేసీఆర్‌ చెప్పినదాంట్లో ఈ ప్రాజెక్టు లేదని, ఇది పాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా లేదా కొత్త ప్రాజెక్టా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement