Martyrs Stupa
-
టీఆర్ఎస్కు ఉద్యమకారుల హెచ్చరిక..!
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మనోభావాలు, ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద అమరవీరుల స్థూపం పునర్నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉద్యమకారులు డిమాండ్ చేశారు. చిమ్మపూడి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దింపుతామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందనీ, మలిదశ ఉద్యమంలోనూ జిల్లాకు చెందిన ఎంతో మంది పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. దాడులను తట్టుకొని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. -
గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించాలని నిరసన
నెహ్రూసెంటర్(మహబూబాబాద్) : మానుకోట కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్థూపానికి చుట్టిన గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించి, తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలని టీజేఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం స్థూపం వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు కాగా ఏర్పాటు చేసుకున్న స్థూపానికి టీఆర్ఎస్ పార్టీ రంగు అయిన గులాబీ వస్త్రాన్ని చుట్టి అవమానించారని ఆరోపించారు. ఉద్యమకారులు భూక్య సత్యనారాయణ బెజ్జం ఐలయ్య పాల్గొన్నారు. -
స్ఫూర్తి యాత్ర టెన్షన్.. టెన్షన్
కోదండరాంను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ► భిక్కనూరులో అరెస్టు.. సాయంత్రం హైదరాబాద్‌కు తరలింపు ► కామారెడ్డిలో జేఏసీ వేదిక వద్ద రణరంగం ► అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అడ్డంకులు: కోదండరాం ► నేడు మళ్లీ యాత్ర కొనసాగిస్తానని స్పష్టీకరణ సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్ వద్దకు యాత్ర చేరుకోగానే అధికార పార్టీ నేతలు అడ్డు తగిలారు. అక్కడ్నుంచి కోదండరాంను పోలీసులు ముందుకు పంపించగా భిక్కనూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన తర్వాత కామారెడ్డి వైపు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు కోదండరాంతోపాటు జేఏసీ నేతలను అరెస్టు చేసి భిక్కనూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోదండరాంను బలవంతంగా జీపులో ఎక్కించి హైదరాబాద్ తరలించారు. టెంట్ కూల్చివేత.. కామారెడ్డి మున్సిపాలిటీ ఎదుట జేఏసీ తలపెట్టిన సభావేదిక రణరంగమైంది. వేదిక వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ జేఏసీ నేతలపై దాడికి దిగారు. కొందరు వేదిక టెంట్ కూల్చివేయగా, మరికొందరు విద్యార్థి నాయకులను పట్టుకుని చితకబాదారు. ఇందులో పలువురు నాయకులతోపాటు ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ విద్యార్థి నాయకులు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నేతలు వారిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో జేఏసీ, విద్యార్థి నేతలు 15 మంది, టీఆర్ఎస్ నేతలు 15 మంది ఉన్నారు. సీపీఐ ఖండన టీజేఏసీ స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ–ఎంఎల్ న్యూ డెమో క్రసీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. ఇలాంటి నియంతృత్వ పోక డలు మంచివి కావని చాడ హెచ్చరించారు. అడ్డుకుంటే టీఆర్ఎస్కే ముప్పు: కోదండరాం దాడులకు భయపడేది లేదని, శనివారం కామారెడ్డి జిల్లాలో తన యాత్ర కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేతలు యాత్రకు అడ్డుపడుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. దాడికి గురైన వారినే అరెస్టు చేయడం, హైదరాబాద్ దాకా తీసుకురావడం అన్యాయమన్నారు. ఇలాంటి అప్ర జాస్వామిక వ్యవహార శైలి టీఆర్ఎస్కే ముప్పు అని హెచ్చరించారు. అంతకుముందు ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతలు యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బాన్సువాడలో జరిగిన మంజీర ఇసుక అవినీతిని ప్రశ్నిస్తానని మంత్రి పోచారం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, కామారెడ్డిలో భూ దందాలు, అక్రమాలపై ప్రశ్నిస్తానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు భయపడి టీఆర్ఎస్ గుండాలతో దాడులు చేయించారన్నారు. సీఎం ప్రారంభించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రీ ఇంజనీరింగ్ అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినదాంట్లో ఈ ప్రాజెక్టు లేదని, ఇది పాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా లేదా కొత్త ప్రాజెక్టా అని ప్రశ్నించారు. -
ఘనంగా జయశంకర్ జయంతి
నర్సంపేట: డివిజన్ వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ చిత్రపటానికి రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రాయిడి రవీందర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, వైస్ చైర్మన్ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ గుంటి కిషన్, నాయిని నర్సయ్య, పుట్టపాక కుమారస్వామి, నాగిశెట్టి ప్రసాద్, జ్ఞాన్‌సాగర్, కామగోని శ్రీనివాస్, బండి ప్రవీణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే టీజేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీజేఏసీ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోనగాని రవీందర్, జిల్లా కోఆర్డినేటర్ షేక్‌జావెద్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, సాంబరెడ్డి, రవి, యాకుబ్, కమల్ పాల్గొన్నారు. -
అమరవీరుల స్థూపానికి కోదండరామ్ నివాళి
మధిర: మధిరలోని తెలంగాణ తల్లి విగ్రహం, నూతనంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం నివాళి అర్పించారు. మధిర జెఏసీ కన్వీనర్ మందడపు రామారావు, కో-కన్వీనర్ చెరుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరామ్ మాట్లాడారు. 1969లో హైద్రాబాద్ నగర మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. దిగ్బంధాల నడుమ, ప్రజల ఆకాంక్ష మేరకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమరవీరులకు గుర్తుగా ఇటువంటి స్థూపాలను ఏర్పాటు చే సుకోవడం అభినందనీయమన్నారు. పోరాటం పట్ల నిబద్దత ఉంటేనే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చునన్నారు. ఆంధ్రా సరిహద్దులో ఉన్న మధిరలో వీరోచిత పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను అభినందించారు. రాబోయే రోజుల్లో స్థూపంవద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన కనకం ఆశీర్వాదం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగ ని విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు జరిగాయని గుర్తుచేశారు. ఢిల్లీలో యాదిరెడ్డి వంటి ఉద్యమకారులు రాష్ట్రం కోసం బలిదానాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల బలిదానాల ఫలితంగా, ఉద్యమాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని.. పనిచేయాల్సి ఉందన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కోదండరామ్ మధిరకు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా జెఏసీ ఆధ్వర్యంలో మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, మధిర డివిజన్ కన్వీనర్ ఎస్.విజయ్, నాయకులు బిచ్చాల తిరుమలరావు, బెజవాడ రవిబాబు, టీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, బీజెపీ ఇన్చార్జ్ పెరుమాళ్లపల్లి విజయరాజు, సురేష్, అర్జున్‌రావు, అవ్వా విజయలక్ష్మి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే సామాజిక మార్పు : కోదండరామ్ సామాజిక మార్పుకు విద్యారంగమే మూలకారణమని తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేషన్‌క్లబ్ ఆవరణలో శనివారం తెలంగాణ ప్రొగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో విద్యారంగం-సంస్కరణలు-సవాళ్లు- కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో వనరులున్నా మౌలిక వసతులు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఆంధ్ర పాలనలో చితికిపోయిన అన్ని వ్యవస్థలను బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవమానాలు, అసమానతల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే ఆలోచన ఇటువంటి ఉద్యమాలతోనే వచ్చిందన్నారు. విద్యారంగాన్ని పటిష్టం చేయూలని, తెలంగాణ పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. 1996నుంచి 2004వరకు విద్యారంగం అభివృద్ది చేయాలని కోరుతూ ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి పాలకులకు వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తుచేశారు. అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ప్రజల్లో ైచె తన్యం రావాలన్నారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ఊరూరా తిరిగి ప్రచారం చేయాలన్నారు. కళాశాలలకు నిధులను పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ విజయ్, పీఆర్టీయూ నాయకులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిపురం ప్రభు త్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన జై తెలంగాణ నృత్యం అలరించింది.