అమరవీరుల స్థూపానికి కోదండరామ్ నివాళి
మధిర: మధిరలోని తెలంగాణ తల్లి విగ్రహం, నూతనంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం నివాళి అర్పించారు. మధిర జెఏసీ కన్వీనర్ మందడపు రామారావు, కో-కన్వీనర్ చెరుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరామ్ మాట్లాడారు. 1969లో హైద్రాబాద్ నగర మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
దిగ్బంధాల నడుమ, ప్రజల ఆకాంక్ష మేరకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమరవీరులకు గుర్తుగా ఇటువంటి స్థూపాలను ఏర్పాటు చే సుకోవడం అభినందనీయమన్నారు. పోరాటం పట్ల నిబద్దత ఉంటేనే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చునన్నారు. ఆంధ్రా సరిహద్దులో ఉన్న మధిరలో వీరోచిత పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను అభినందించారు. రాబోయే రోజుల్లో స్థూపంవద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన కనకం ఆశీర్వాదం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగ ని విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు జరిగాయని గుర్తుచేశారు. ఢిల్లీలో యాదిరెడ్డి వంటి ఉద్యమకారులు రాష్ట్రం కోసం బలిదానాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల బలిదానాల ఫలితంగా, ఉద్యమాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని.. పనిచేయాల్సి ఉందన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
కోదండరామ్ మధిరకు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా జెఏసీ ఆధ్వర్యంలో మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, మధిర డివిజన్ కన్వీనర్ ఎస్.విజయ్, నాయకులు బిచ్చాల తిరుమలరావు, బెజవాడ రవిబాబు, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, బీజెపీ ఇన్‌చార్జ్ పెరుమాళ్లపల్లి విజయరాజు, సురేష్, అర్జున్‌రావు, అవ్వా విజయలక్ష్మి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే సామాజిక మార్పు : కోదండరామ్
సామాజిక మార్పుకు విద్యారంగమే మూలకారణమని తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేషన్‌క్లబ్ ఆవరణలో శనివారం తెలంగాణ ప్రొగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో విద్యారంగం-సంస్కరణలు-సవాళ్లు- కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో వనరులున్నా మౌలిక వసతులు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఆంధ్ర పాలనలో చితికిపోయిన అన్ని వ్యవస్థలను బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అవమానాలు, అసమానతల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే ఆలోచన ఇటువంటి ఉద్యమాలతోనే వచ్చిందన్నారు. విద్యారంగాన్ని పటిష్టం చేయూలని, తెలంగాణ పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. 1996నుంచి 2004వరకు విద్యారంగం అభివృద్ది చేయాలని కోరుతూ ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి పాలకులకు వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తుచేశారు.
అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ప్రజల్లో ైచె తన్యం రావాలన్నారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ఊరూరా తిరిగి ప్రచారం చేయాలన్నారు. కళాశాలలకు నిధులను పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ విజయ్, పీఆర్‌టీయూ నాయకులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిపురం ప్రభు త్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన జై తెలంగాణ నృత్యం అలరించింది.