
జయశంకర్ ఆశయాలను సాధిస్తాం
‘తెలంగాణ జాతిపిత’కు జేఏసీ, ఉద్యోగ సంఘాలు, కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే తెలంగాణ జాతిపిత అయిన జయశంకర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ 79వ జయంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ వద్ద జేఏసీ, ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... నిరాడంబరంగా గడిపిన జయశంకర్ జీవితం తెలంగాణవాదులకు ఆదర్శమన్నారు. వారికి రాజధాని ఏర్పడే వరకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను రాజధానిగా భావించాలని, అంతే తప్ప హైదరాబాద్ వారిదని అనుకోకూడదని సూచించారు.
ఇక్కడ ఉన్నవారంతా హైదరాబాద్ పౌరులే తప్ప సెటిలర్లు కాదన్నారు. తెలంగాణ కోసం సర్వస్యం త్యాగం చేసిన జయశంకర్ భౌతికంగా తమ మధ్య లేకున్నా.. అందరి హృదయాల్లో కొలువై ఉన్నారని జేఏసీ అగ్రనేత వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలుగు ప్రజలు కలిసి ఉండవద్దనే దురుద్దేశంతోనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేవారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను ఎదుర్కొనేందుకు ఉద్యోగులు నిరంతరం జాగరూకులై ఉండాలని ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ కోరారు. సెటిలర్స్ ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే మైత్రిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు కె.రవీందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, పిట్టల రవీందర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్‌కు కేసీఆర్ నివాళి
జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు నివాళి అర్పించారు. తెలంగాణభవన్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.