చొప్పదండి టికెట్‌.. మాకేనండి..!! | TRS Leaders Fighting For Choppadandi Constituency MLA Ticket | Sakshi
Sakshi News home page

చొప్పదండి టికెట్‌.. మాకేనండి..!!

Published Tue, Sep 25 2018 7:49 AM | Last Updated on Tue, Sep 25 2018 7:49 AM

TRS Leaders Fighting For Choppadandi Constituency MLA Ticket - Sakshi

చొప్పదండి నియోజకవర్గం ఉత్తర తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం చేస్తుండడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమకెందుకులే అన్న వారు కూడా టికెట్‌ వేటలో పడుతున్నారు. చొప్పదండి టికెట్‌ తమకే వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం మొదలు పెట్టారు. క్షేత్రస్థాయిలోకి ఎవరూ వెళ్లకపోయినా తమ అనుచరులతో మంతనాలు జరుపుతూ.. చొప్పదండి టు హైదరాబాద్, హైదరాబాద్‌ టు చొప్పదండికి చక్కర్లు కొడుతూ తమకున్న పరిచయాలు పలుకుబడిని ఉపయోగించి టిక్కెట్ల వేటలో పడ్డారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 మంది అభ్యర్థిత్వాలు ఖరారు చేసి ఒక్క చొప్పదండికి మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎవరికి వారు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ప్రజల నాడి పట్టుకుని ఫలితాన్ని ఖచ్చితంగా రాబట్టా లనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కేటాయించే వరకు వేచిచూడాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నామినేట్‌ చేస్తుందనే ఉత్కంఠకు తెరతీయక ముందే తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆమె మాత్రం అధిష్టానంపై భారం వేసి ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: చొప్పదండి నియోజకవర్గం రిజర్వుడ్‌ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు సైతం చొప్పదండిపై కన్నేసి టికెట్లు ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఇటీవలే ఆర్డీవోగా పదవీ విమరణ పొందిన బైరం పద్మయ్య, తెలంగాణ గాయని వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి, గజ్జెల స్వామి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారుగా హైదరాబాద్‌ వెళ్లి అధినేత దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టికెట్‌పై ఇప్పుడిప్పుడే సస్పెన్స్‌ వీడేలా లేదు. ఇక కాంగ్రెస్‌లో కూడా టికెట్‌ పోటీ తీవ్రంగానే ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చొప్పదండి నియోజకవర్గం శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందిన మేడిపల్లి సత్యం ఆ తర్వాత  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రేవంత్‌రెడ్డితో కలిసి చేరికలు జరిగిన రోజే పార్టీ సత్యంకు టికెట్‌ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొని పోటీకి దిగిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సైతం ఈసారి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో చొప్పదండి టికెట్‌ ఆశించి భంగపడడంతోపాటు కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మ న్‌ గజ్జెల కాంతం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, టికెట్‌ కేటాయింపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందు కు మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ చొప్పదండి టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీకే కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
తలనొప్పిగా ‘చొప్పదండి’..
ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఒక్క చొప్పదండిని మినహాయించింది. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల పొత్తుల కూటమి నుంచి ఈ స్థానంపై ఇ తర పార్టీలు అంతగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకే ఈ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చొప్పదండిలో టీఆర్‌ఎస్‌ తోపాటు కాంగ్రెస్‌ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే.. ఆశావహులంతా తమ గాడ్‌ఫాదర్‌లను, పార్టీ ముఖ్యులను రం గంలోకి దింపి టికెట్‌ వేటలో పడ్డారు. దీంతో ఎవరికి టికెట్‌ కేటాయించాలనే సందిగ్ధం మొ దలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో తాజా మాజీ ఎమ్మెల్యేకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవ డం వల్లే అధికార పార్టీలో ఈ పరిస్థితి వచ్చిన ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో గతంలో జరిగిన వలసల సమయంలో హామీలపై స్ప ష్టత లేకపోవడంతో మిగతా నేతలు సైతం తీవ్ర ప్ర యత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఇదిలా వుండగా వైఎస్‌ఆర్‌సీపీ ఈసారి కూడా చొప్పదండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనుండగా, ఇక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కెన్నపల్లి కుమార్‌ పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. దాదాపుగా ఆయనకే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్న ట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా, భారతీ య జనతా పార్టీ, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌), బీఎస్‌పీ తదితర పార్టీలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement