choppadandi constituency
-
చొప్పదండి: అధికార పార్టీకి రెబల్స్ బెడద..
BRS పార్టీ నుండి 2014 లో బొడిగె శోభ , 2019 లో సుంకే రవిశంకర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మాదిగ, మాల, బిసి కులాలు నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా ఉన్నాయి. పైగా బీఆర్ఎస్కు ఈసారి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేరు. బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి BSP నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఆశావాహులు BRS .. సుంకె రవిశంకర్ CONGRESS 1)మేడిపల్లి సత్యం(చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి) BJP 1) బొడిగ శోభ(మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి) 2) సుద్దాల దేవయ్య(మాజీమంత్రి) BRS ప్రతికూల అంశాలు: బోయినిపల్లి,రామడుగు,గంగాధర మండలాల్లో లో ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. రైతుల ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడం ,సమస్యలు ఉన్నా చోటికి వెల్లకపోవడం. కొండగట్టు అభివృద్ధి పనులు ప్రారంభించక పోవటం. కులవసంఘ భవనాలకు,దళిత బంధు కు కమీషన్లు తీసుకోవడం. స్వంత ఊరిలో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకోవడం,గంగాధర, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేయడం. పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గం పై అక్రమ కేసులు పెట్టడం. మండల,గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం. తమకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై అధిష్ఠానంకు రెడ్డి, రావు నాయకుల ఫిర్యాదు. అనుకూలతలు గాయత్రీ పంపు హౌజ్ నిర్మాణం, చొప్పదండి మున్సిపాలిటీ కావడం, స్మార్ట్ సిటీ పనులు చేపట్టడం. సీఎం రిలీఫ్ పండ్,కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచిపేరు ఉండటం. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మైనస్‌లు: కొండగట్టు ఆలయ అభివృద్ధికి హామీలు తప్ప, పనులు ప్రారంభించక పోవటం. ముంఫు గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవటం,అవసరం ఉన్న మండలాల్లో రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవటం. పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్ మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకుపోవడం లేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్‌కు చెందిన ఒక కార్పొరేటర్.. బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. అందులో తనకు టికెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీ బాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో.. ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ -
వాటర్ హబ్‌గాచొప్పదండి
సాక్షి, చొప్పదండి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం వాటర్‌హబ్‌గా మారుతోంది. ప్రాజెకుకు సంబంధించిన కీలక నిర్మాణాలతో ‘చొప్పదండి’ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన అండర్ టన్నెల్ సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్లతో భూఉపరితలంపై పారిస్తూ జీవనదిగా మారుస్తున్నారు. మల్యాల మండలం రాంపూర్‌లో పంప్‌హౌస్ నిర్మాణంతో నీటి లభ్యత లేక మోడువారిన ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు పునరు జ్జీవం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో రివర్స్ పంపింగ్‌ను ప్రారంభించి ఎస్సారెస్పీ నింపేందుకు వరుద కాలుపై ఏర్పాటు చేసిన రాంపూర్ పంప్‌హౌస్ కీలకం కా నుంది. బోయిన్పల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయం కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు తరలించే గోదావరి జలాలకు అడ్డాగా నిలువనుంది. 24 టీఎంసీల ప్రాజెక్ట్‌కు నీటిని సరఫరా చేసే వరుద కాలువ 365 రోజులు జీవనదిలా మారనుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పైప్‌లైన్ ద్వారా పంపింగ్ చేసే నీటికి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ కీలకంగా మారింది. తెలంగాణను వాటర్ హబ్‌గా మార్చాలన్న కేసీఆర్ లక్ష్యానికి చొప్పదండి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలే కీలకంగా మారుతున్నాయి. గాయత్రి పంప్‌హౌస్.. రామడుగు మండలం లక్ష్మీపూర్ అండర్ టన్నెల్లో నిర్మించిన సర్జ్‌పూల్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని వరుద కాలువలోకి ఎత్తిపోయడమే లక్ష్యంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక్కో మోటారుకు 139 మెగావాట్ల విద్యుత్ వాడకంతో అయిదు బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ అధికారులు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు. ఏకకాలంలో 22 వేల క్యూసెక్కుల నీటిని అండర్ టన్నెల్ నుంచి ఎత్తిపోసి వరుద కాలవ ద్వారా ఒక టీఎంసీ మిడ్ మానేరుకు, మరో టీఎంసీ ఎస్సారెస్పీకి తరలించేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. వెట్‌రన్ విజయవంతమై ప్రస్తుతం గోదావరి జలాలు మిడ్ మానేరుకు, అక్కడి నుంచి దిగువ మానేరుకు చేరాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపొందించిన డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ ఏర్పాటును రూపొందించారు. ఎనిమిదో ప్యాకేజీ కింద రూపొందిన లక్ష్మీపూర్ ప్రాజెక్ట్ కోసం రైతులు తమ వ్యసాయ భూములను కూడా త్యాగం చేశారు. రాంపూర్ పంప్‌హౌస్ మల్యాల మండలం రాంపూర్‌లో వరుద కాలువపై ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీ నింపేందుకు పనులు చివరి దశలో ఉన్నాయి. గాయత్రి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసిన నీరు వరుద కాలువలో నిరంతరం నిలువ ఉండే అవకాశం ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు ఒక టీఎంసీ ఎస్సారెస్పీకి తరలించేందుకు పంపులు సిద్ధం చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో రోజుకు ఏడు వేల క్యూసెక్కుల నుంచి అర టీఎంసీ వరకు పంపింగ్ చేయనున్నారు. రాంపూర్ పంప్‌హౌస్‌లో ఎనిమిది మోటార్లను సిద్ధం చేయగా, ఒక్కో మోటారు 6.5 మెగావాట్లతో పని చేయనుంది. దీంతోపాటు వరుద కాలువ నీటిని మల్యాల మండలం తాటిపెల్లి నుంచి నూకపల్లి వరకు మళ్లించి కాకతీయ కాలువకు అనుసందానం చేశారు. కాకతీయ కాలువ నుంచి డి–83 ఉప కాలువ నుంచి డి–94 ఉప కాలువ వరకు సాగునీరు అందించనున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఈ పథకం ఉపయోగపడనుంది. మిడ్మానేరే కీలకం బోయిన్పల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్య మానేరు ప్రాజెక్టు పలు జిల్లాలకు నీటిని తరలించడంలో కీలకం కానుంది. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎండీకి, అక్కడి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగునీరు, తాగునీరు అందుతుంది. దీంతోపాటు ఎగువన మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతోపాటు, హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లోకి గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీటి తరలింపు జరుగుతోంది. జీవనదిలా వరద కాలువ.. రామడుగు మండలం షానగర్ నుంచి మల్యాల మండలం రాంపూర్ వరకు వరద కాలువపై ఏర్పాటు చేసిన గేట్లతో కాలువలో ఏడాదిపాటు నిండుగా ఉండనుంది. ప్రాణహిత నది నుంచి ఏడాది పాటు నీటి లభ్యత ఉండే అవకాశం ఉండగా, లింకు 2లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుద కాలువలోకి నీరు పంపింగ్ అవుతుండగా, వరద కాలువలో గేట్లు దించడం ద్వారా నీటి నిలువలు కొనసాగనున్నాయి. వరద కాలువకు తూముల ఏర్పాటుతో మోతె కాలువలు నిర్మాణం చేసి నింపడం ద్వారా చొప్పదండి నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తానికి చొప్పదండి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరద కాలువలో ప్రవహించే నీరు తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మారుతోంది. -
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం
సాక్షి, మల్యాల: రైతులు, కార్మికులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకం కానున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలో గ్రామ సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీపీ తైదల శ్రీలత, జనగం శ్రీనివాస్, నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బల్మూరి రామ్మోహన్రావు, తాటిపాముల రాజేందర్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు బద్దం తిరుపతిరెడ్డి, కట్కూరి తిరుపతి, ఉప సర్పంచ్ డి.కరుణాకర్, ఎంపీటీసీ ఏనుగు రాజిరెడ్డి, దూస వెంకన్న, పోచంపల్లి రాయమల్లు, వంశీధర్, మోత్కు కొమురయ్య, సింగిల్‌విండో చైర్మన్ అడువాల సురేశ్, శివ, రియాజొద్దీన్ పాల్గొన్నారు. రామడుగులో... ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలిచేందుకు కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. వెదిర గ్రామానికి చెందిన వ్యాపారి దొడ్డ లచ్చిరెడ్డితోపాటు ఉప సర్పంచ్ ఎడెల్లి సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యుడు బొల్లి రమేశ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తొరికొండ నారాయణ, పలువురు టీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, రామడుగు, కొక్కెరకుంట సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్రావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, వెదిర గ్రామ వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్‌గౌడ్, డైరెక్టర్ ఏరెడ్డి కొంరారెడ్డి, నాయకులు లేఖ రాజు, ప్రసాద్, అంజన్‌కుమార్, రాల్లబండి శ్రీనివాస్‌రెడ్డి, నరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పుర్మాణి శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చొప్పదండి టికెట్.. మాకేనండి..!!
చొప్పదండి నియోజకవర్గం ఉత్తర తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం చేస్తుండడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమకెందుకులే అన్న వారు కూడా టికెట్ వేటలో పడుతున్నారు. చొప్పదండి టికెట్ తమకే వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం మొదలు పెట్టారు. క్షేత్రస్థాయిలోకి ఎవరూ వెళ్లకపోయినా తమ అనుచరులతో మంతనాలు జరుపుతూ.. చొప్పదండి టు హైదరాబాద్, హైదరాబాద్ టు చొప్పదండికి చక్కర్లు కొడుతూ తమకున్న పరిచయాలు పలుకుబడిని ఉపయోగించి టిక్కెట్ల వేటలో పడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మంది అభ్యర్థిత్వాలు ఖరారు చేసి ఒక్క చొప్పదండికి మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల నాడి పట్టుకుని ఫలితాన్ని ఖచ్చితంగా రాబట్టా లనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు సైతం టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించే వరకు వేచిచూడాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నామినేట్ చేస్తుందనే ఉత్కంఠకు తెరతీయక ముందే తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆమె మాత్రం అధిష్టానంపై భారం వేసి ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: చొప్పదండి నియోజకవర్గం రిజర్వుడ్ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు సైతం చొప్పదండిపై కన్నేసి టికెట్లు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఇటీవలే ఆర్డీవోగా పదవీ విమరణ పొందిన బైరం పద్మయ్య, తెలంగాణ గాయని వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి, గజ్జెల స్వామి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారుగా హైదరాబాద్ వెళ్లి అధినేత దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టికెట్‌పై ఇప్పుడిప్పుడే సస్పెన్స్ వీడేలా లేదు. ఇక కాంగ్రెస్‌లో కూడా టికెట్ పోటీ తీవ్రంగానే ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చొప్పదండి నియోజకవర్గం శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందిన మేడిపల్లి సత్యం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డితో కలిసి చేరికలు జరిగిన రోజే పార్టీ సత్యంకు టికెట్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పోటీకి దిగిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సైతం ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో చొప్పదండి టికెట్ ఆశించి భంగపడడంతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మ న్ గజ్జెల కాంతం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, టికెట్ కేటాయింపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. టీఆర్ఎస్ను ఓడించేందు కు మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ చొప్పదండి టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకే కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తలనొప్పిగా ‘చొప్పదండి’.. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఒక్క చొప్పదండిని మినహాయించింది. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల పొత్తుల కూటమి నుంచి ఈ స్థానంపై ఇ తర పార్టీలు అంతగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చొప్పదండిలో టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే.. ఆశావహులంతా తమ గాడ్ఫాదర్లను, పార్టీ ముఖ్యులను రం గంలోకి దింపి టికెట్ వేటలో పడ్డారు. దీంతో ఎవరికి టికెట్ కేటాయించాలనే సందిగ్ధం మొ దలైంది. టీఆర్ఎస్ పార్టీలో తాజా మాజీ ఎమ్మెల్యేకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవ డం వల్లే అధికార పార్టీలో ఈ పరిస్థితి వచ్చిన ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో గతంలో జరిగిన వలసల సమయంలో హామీలపై స్ప ష్టత లేకపోవడంతో మిగతా నేతలు సైతం తీవ్ర ప్ర యత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఇదిలా వుండగా వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా చొప్పదండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనుండగా, ఇక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కెన్నపల్లి కుమార్ పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. దాదాపుగా ఆయనకే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్న ట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా, భారతీ య జనతా పార్టీ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), బీఎస్పీ తదితర పార్టీలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నాయకుల షాక్..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ చొప్పదండి నియోజకవర్గం నాయకుల మధ్య వివాదం రాజుకొంది. ఎమ్మెల్యే బొడిగే శోభకు వ్యతిరేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ వద్ద గళం విప్పారు. ఎమ్మెల్యే పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బొడిగె శోభకు టికెట్ ఇవ్వొద్దని వారు కేసీఆర్‌ను కోరారు. -
దుద్దిళ్ల వర్సెస్ పొన్నం
కరీంనగర్: కలిసి ఉన్నట్లు కనిపించినా... కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు అంతర్గతంగా రాజుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య కోల్డ్‌వార్ ముదురుతోంది. మొన్నటివరకు పీసీసీ చీఫ్ రేసులో అధిష్టానం దృష్టిలో పడ్డ వీరిద్దరూ... సొంత జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారు. అవునంటే కాదనిలే అన్నట్లు ఎవరికివారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో రచ్చకెక్కిన విభేదాలు వరుసగా వచ్చిన ఎన్నికలతో మరింత రాజుకోవటం ఖాయమైంది. ఇటీవల ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్టు ఆశిస్తున్నారు. ముందుగా మంత్రిని ఆశ్రయించటంతో పాటు... శ్రీధర్‌బాబు ఇచ్చిన భరోసా మేరకే కాంతం పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ మంత్రి సమక్షంలో కాంతం కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలోనూ పొన్నం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈలోపు తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్‌ను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో మానకొండూరు నుంచి పార్టీ టికెట్టు హామీ ఇవ్వటంతో బాలకిషన్ టీఆర్ఎస్లో చేరారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్... టీఆర్ఎస్... ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తెరపైకి వచ్చారు. మొన్నటివరకు దూరం పెట్టిన దేవయ్యను పార్టీలోకి చేర్చుకునేందుకు ఎంపీ తన వంతుగా లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే విషయుంపైనే దేవయ్య హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాలను కలిసినట్లు సమాచారం. దీంతో రేపో మాపో దేవయ్య పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యం సైతం చొప్పదండి నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. సిట్టింగ్ కావటంతో ఎంపీ వ్యూహాత్మకంగానే దేవయ్యను టికెట్టు రేసులోకి తెచ్చి.. గజ్జెల కాంతంకు, ఆయనను ప్రోత్సహించిన మాజీ మంత్రికి చెక్ పెట్టినట్లయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల సమీకరణాల్లోనూ దేవయ్యను పార్టీలోకి చేర్చుకోవటం సరైందనే వాదన పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలోనూ ఎంపీ, మంత్రి మధ్య అంతరం పెరిగిపోయింది. తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో మంత్రి వర్గీయులుగా హల్చల్ చేసి గొడవకు దిగిన వారందరికీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో టికెట్లు ఇవ్వకుండా చెక్ పెట్టాలని ఎంపీ పంతం పట్టారు. ఈ టికెట్ల వ్యవహారంలో తమను లెక్కచేయకపోతే బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టి నిలదీస్తావుని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ మాజీ మంత్రి దగ్గర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బయటకు పొక్కింది. ఎంపీ.. మంత్రి వర్గీయుల పంతం కారణంగానే కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థిత్వాలు కొలిక్కి రాలేదు. ఆఖరి రోజు వరకు 50 డివిజన్లలో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ వెనుకా ముందాడింది. ఒకప్పుడు ఒకే వర్గంగా ఉన్న శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు తెలంగాణ ఉద్యమం తీవ్రతరమవుతున్న కొద్దీ దూరం పెరుగుతూ రావటం గమనార్హం.