ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వినియోగిస్తున్న బాహుబలి మోటార్లు
సాక్షి, చొప్పదండి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం వాటర్‌హబ్‌గా మారుతోంది. ప్రాజెకుకు సంబంధించిన కీలక నిర్మాణాలతో ‘చొప్పదండి’ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన అండర్ టన్నెల్ సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్లతో భూఉపరితలంపై పారిస్తూ జీవనదిగా మారుస్తున్నారు. మల్యాల మండలం రాంపూర్‌లో పంప్‌హౌస్ నిర్మాణంతో నీటి లభ్యత లేక మోడువారిన ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు పునరు జ్జీవం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
కొద్ది రోజుల్లో రివర్స్ పంపింగ్‌ను ప్రారంభించి ఎస్సారెస్పీ నింపేందుకు వరుద కాలుపై ఏర్పాటు చేసిన రాంపూర్ పంప్‌హౌస్ కీలకం కా నుంది. బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయం కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు తరలించే గోదావరి జలాలకు అడ్డాగా నిలువనుంది. 24 టీఎంసీల ప్రాజెక్ట్‌కు నీటిని సరఫరా చేసే వరుద కాలువ 365 రోజులు జీవనదిలా మారనుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పైప్‌లైన్ ద్వారా పంపింగ్ చేసే నీటికి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ కీలకంగా మారింది. తెలంగాణను వాటర్ హబ్‌గా మార్చాలన్న కేసీఆర్ లక్ష్యానికి చొప్పదండి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలే కీలకంగా మారుతున్నాయి.
గాయత్రి పంప్‌హౌస్..
రామడుగు మండలం లక్ష్మీపూర్ అండర్ టన్నెల్‌లో నిర్మించిన సర్జ్‌పూల్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని వరుద కాలువలోకి ఎత్తిపోయడమే లక్ష్యంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక్కో మోటారుకు 139 మెగావాట్ల విద్యుత్ వాడకంతో అయిదు బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ అధికారులు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు. ఏకకాలంలో 22 వేల క్యూసెక్కుల నీటిని అండర్ టన్నెల్ నుంచి ఎత్తిపోసి వరుద కాలవ ద్వారా ఒక టీఎంసీ మిడ్ మానేరుకు, మరో టీఎంసీ ఎస్సారెస్పీకి తరలించేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. వెట్‌రన్ విజయవంతమై ప్రస్తుతం గోదావరి జలాలు మిడ్ మానేరుకు, అక్కడి నుంచి దిగువ మానేరుకు చేరాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపొందించిన డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ ఏర్పాటును రూపొందించారు. ఎనిమిదో ప్యాకేజీ కింద రూపొందిన లక్ష్మీపూర్ ప్రాజెక్ట్ కోసం రైతులు తమ వ్యసాయ భూములను కూడా త్యాగం చేశారు.
రాంపూర్ పంప్‌హౌస్
మల్యాల మండలం రాంపూర్‌లో వరుద కాలువపై ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీ నింపేందుకు పనులు చివరి దశలో ఉన్నాయి. గాయత్రి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసిన నీరు వరుద కాలువలో నిరంతరం నిలువ ఉండే అవకాశం ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు ఒక టీఎంసీ ఎస్సారెస్పీకి తరలించేందుకు పంపులు సిద్ధం చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో రోజుకు ఏడు వేల క్యూసెక్కుల నుంచి అర టీఎంసీ వరకు పంపింగ్ చేయనున్నారు. రాంపూర్ పంప్‌హౌస్‌లో ఎనిమిది మోటార్లను సిద్ధం చేయగా, ఒక్కో మోటారు 6.5 మెగావాట్లతో పని చేయనుంది. దీంతోపాటు వరుద కాలువ నీటిని మల్యాల మండలం తాటిపెల్లి నుంచి నూకపల్లి వరకు మళ్లించి కాకతీయ కాలువకు అనుసందానం చేశారు. కాకతీయ కాలువ నుంచి డి–83 ఉప కాలువ నుంచి డి–94 ఉప కాలువ వరకు సాగునీరు అందించనున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఈ పథకం ఉపయోగపడనుంది.
మిడ్‌మానేరే కీలకం
బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్య మానేరు ప్రాజెక్టు పలు జిల్లాలకు నీటిని తరలించడంలో కీలకం కానుంది. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి ఎల్‌ఎండీకి, అక్కడి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగునీరు, తాగునీరు అందుతుంది. దీంతోపాటు ఎగువన మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతోపాటు, హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లోకి గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీటి తరలింపు జరుగుతోంది.
జీవనదిలా వరద కాలువ..
రామడుగు మండలం షానగర్ నుంచి మల్యాల మండలం రాంపూర్ వరకు వరద కాలువపై ఏర్పాటు చేసిన గేట్లతో కాలువలో ఏడాదిపాటు నిండుగా ఉండనుంది. ప్రాణహిత నది నుంచి ఏడాది పాటు నీటి లభ్యత ఉండే అవకాశం ఉండగా, లింకు 2లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుద కాలువలోకి నీరు పంపింగ్ అవుతుండగా, వరద కాలువలో గేట్లు దించడం ద్వారా నీటి నిలువలు కొనసాగనున్నాయి. వరద కాలువకు తూముల ఏర్పాటుతో మోతె కాలువలు నిర్మాణం చేసి నింపడం ద్వారా చొప్పదండి నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తానికి చొప్పదండి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరద కాలువలో ప్రవహించే నీరు తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment