హైదరాబాద్‌లో కేశవరావుకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ పొంగులేటి వర్గీయులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిరసన సెగ రాజధానికి తాకింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులను మార్చాలనే నిరసనలు ఇప్పటివరకు నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి. అయితే ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన నేతలతోపాటు అభ్యర్థుల వైఖరిని వ్యతిరేకిస్తున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం.. వారిపై ఉన్న అసం తృప్తిని పార్టీ అధినాయకత్వానికి చాటిచెప్పే ప్రయత్నాలను వేగవంతం చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతోపాటు కొత్తగూడెంలోనూ అభ్యర్థులను మార్చాలంటూ ఆందోళనలు చేపట్టడంతో ఇవి ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో గుబులు వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన మట్టా దయానంద్ తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర నిర్వేదానికి గురై కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. తన రాజకీయ భవిష్యత్.. కార్యాచరణ రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు మోటారు సైకిళ్ల ప్రదర్శన, సత్తుపల్లిలో సమావేశం నిర్వహించారు.
టీఆర్‌ఎస్‌లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే వ్యక్తిగా.. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తిగా పార్టీ టికెట్ ఆశించానని, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ సత్తుపల్లి అభ్యర్థిత్వం విషయంలో పునఃపరిశీలించాలని కోరారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటానని స్పష్టం చేయడం, దయానంద్ నిర్వహించిన ర్యాలీకి లభించిన స్పందనపై ఇంటెలీజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ జిల్లాలోని పలువురు అభ్యర్థుల అభ్యర్థిత్వంపై వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు గౌరవం ఇచ్చి.. కార్యకర్తలకు అండగా ఉండే వారికి టికెట్లు ఇస్తే వారిని గెలిపించడానికి సిద్ధమంటూ వైరా నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం నాయకులు ఆయా మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి రాజకీయ సెగ అధినాయకత్వానికి తెలియాలన్న లక్ష్యంతో ఇద్దరు జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది.
కొత్తగూడెంలో కూడా..
మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ.. అక్కడి టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి వర్గం మంగళవారం ఆందోళనకు దిగడంతో జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై నిరసన సెగలు అలుముకున్న తీరును నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైరా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై తాజా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌కు వెళ్లి ఎంపీ, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావును, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిసి నియోజకవర్గ పరిస్థితులపై వివరించారు.
ఈ మేరకు వినతిపత్రం సమర్పించి.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మట్టా దయానంద్ సైతం తనకు మద్దతు పలుకుతున్న కార్యకర్తలు, నాయకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉండాలని మంగళవారం జరిగిన సమావేశంలో దయానంద్‌ను పలువురు కోరడం, దానిపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమాలోచనలు జరిపి అనంతరం నియోజకవర్గ పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలియజేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారుపై నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
అయితే టీఆర్‌ఎస్‌లోని పలు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించడానికి.. అసమ్మతి నేతలకు నచ్చజెప్పేందుకు పార్టీ అధినాయకత్వం జిల్లా మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరును పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఈనెల 6న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈనెల 14న పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి హోదాలో తొలిసారిగా జిల్లాకు రానుండడంతో తన నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ పూర్తి చేసుకుని తర్వాత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎగసిపడుతున్న అసమ్మతిపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాలవారీగా అభ్యర్థులతోనూ.. అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తున్న నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment