సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీ కేడర్‌కు మధ్య అంతరం పూడ్చడానికి, మారిన రాజకీయ పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకత్వం సమాయత్తమవుతోంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడంపై స్పష్టతనిచ్చి, పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో.. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీలు పాల్గొననున్నాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్వహించాల్సిన ప్రచారంపై పార్టీ అధినేత ఈ భేటీలో స్పష్టత ఇవ్వనున్నారు.
వలసలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనే..
ప్రధానంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల నుంచి వలసలతో పాటు 11, 12వ తేదీల్లో నిర్వహించనున్న ప్లీనరీ ఎజెండాను విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఇక వరంగల్ జిల్లాతో పాటు ఒకటి, రెండు జిల్లాల్లో టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని ఆ పార్టీ స్థానిక ముఖ్య నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వలసలను ప్రోత్సహించడమనేది పార్టీ బలపేతానికేనని, ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి ఎలాంటి అన్యాయం జరగదనే ఒక సందేశాన్ని కేసీఆర్ ఇవ్వనున్నట్లు పార్టీవర్గాల సమాచారం. దీనితో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అవసరమైన వ్యూహా న్ని వెల్లడించి... ఆ ఎన్నికల కోసం కూడా టీడీపీ, ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల వలస తప్పదనే సంకేతాలపై కేసీఆర్ స్పష్టతనివ్వనున్నారు.
సమన్వయం కోసం..
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలో కొంత స్తబ్దత ఏర్పడడం, అధికారంలో ఉన్న పార్టీగా ఎలాంటి పాత్రను నిర్వహించాలనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా ప్రభుత్వంలో, టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతోపాటు పలు సందర్భాల్లో, ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకున్నపుడు పార్టీపరంగా ఏవిధంగా స్పందించాలనేదానిపైనా స్పష్టత లేని పరిస్థితుల్లో ఏ విధమైన పాత్రను పోషించాలనే దానిపై విస్తృత స్థాయి భేటీలో చర్చ జరుగనుంది. ఇబ్బందికర సందర్భాల్లో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఏలా వ్యవహరించాలనే అంశంపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
11, 12వ తేదీల్లో ప్లీనరీ!
ఈ నెల 11, 12వ తేదీల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నారు. 11న ఎల్‌బీ స్టేడియంలో పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. 12న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో బహిరంగసభను నిర్వహించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. అయితే పరేడ్ గ్రౌండ్స్ కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి వచ్చే అనుమతికి అనుగుణంగా బహిరంగ సభపై నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయా అంశాలపై చర్చించారు.
వలసలు, గ్రేటర్‌పైనే దృష్టి!
Published Sun, Oct 5 2014 1:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement