
నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి.
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేష్ గుప్తా స్పందించారు. పనుల కారణంగా రోడ్లు పాడయ్యాయని.. దీంతో జనం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా తమకు సహకరిస్తున్నందుకు నగర ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
జూన్ లోపు అన్ని పనులు పూర్తవవుతాయన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రూ. 800 కోట్లతో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యూజీడీ పనుల కారణంగా గత నాయకులు అబాసుపాలయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పనులన్నీ పూర్తై తాము చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చితే ఓట్లు వేస్తారని గణేష్ వ్యాఖ్యానించారు.