ఎమ్మెల్యేలకే ఆధిపత్యం!
పార్టీ బలోపేతానికి టీఆర్‌ఎస్ కొత్త వ్యూహం
⇒ కేడర్ పెంచుకునే పనిలో నాయకత్వం
⇒ వలస ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో కొత్త చిక్కులు
⇒ తమ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటున్న పాత కేడర్
⇒ ఆసక్తికరంగా టీఆర్‌ఎస్ సంస్థాగత రాజకీయం
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగతంగా ఇక ఎమ్మెల్యేలకే పెద్ద పీఠ వేయనున్నారు. కింది స్థాయి నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల నియామకం నుంచే ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో పెత్తనం కట్టబెడుతున్నారు. జిల్లా స్థాయి కమిటీలు ఉండవని తేల్చిన పార్టీ నాయకత్వం, నియోజకవర్గ కమిటీలు ఎంత ముఖ్యమో ఇప్పటికే ఎమ్మెల్యేలకు వివరించింది. వివిధ పార్టీల నుంచి నాయకులు, శ్రేణులు టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరినా వారింకా సరిగా కుదురుకోలేదు. మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, టీడీపీలకున్న కార్యకర్తల బలాన్ని విస్మరించకూడదన్న చర్చ కూడా నాయకత్వం వద్ద జరిగినట్లు సమాచారం.
దీంతో తమ పార్టీలో ఉన్న కేడర్‌ను పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు అంకితమయ్యేలా, తద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్రణాళిక రచించారు. ఈ వ్యూహం వల్ల వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని, ఈ బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పెట్టడం వల్లే సత్ఫలితాలు వస్తాయని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పనులన్నీ సక్రమంగా, సజావుగా జరగాలంటే ఆయా కమిటీలను నియమించుకునే వెసులుబాటు, ప్రభుత్వ పదవులకు పేర్లను ప్రతిపాదించే అవకాశం ఎమ్మెల్యేలకే ఉండాలని భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పూర్తి ఆధికారం ఎమ్మెల్యే లకే అప్పజెప్పారు. మంత్రులు, ఎంపీలను సైతం ఏ నియోజకవర్గంలో వేలు పెట్టొద్దని అధినేత సూచించారని సమాచారం.
కొత్త – పాతల కిరికిరీ..
టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన చేరిన ఆయా పార్టీల నేతలకు, పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఇంకా పొసగడం లేదు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న వారిలో స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల నాయకులు ఉన్నారు. అధినేత ఎంత చెప్పినా పాత–కొత్త నేతలు అన్న రేఖ మాత్రం చెరపలేక పోయారు. దీని ప్రభావం ఆయా నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో మంత్రులకు, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు సయోధ్య లేదు. వలస ఎమ్మెల్యేల్లో ఏ కొందరో మినహా అత్యధికులు ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉండిపోయారు. కాగా, ఈ కొత్త విధానం వల్ల వారు కొంత ఊపిరి పీల్చుకునే వెసులు బాటు దొరుకుతుందని, మంత్రుల పెత్తనం తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ గొడవలు స్పష్టంగా కనిపించాయి. మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు అక్కడి పార్టీ శ్రేణులు సహకరించడంలేదు. దేవరకొండలోనూ స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని అంటున్నారు. జిల్లా మంత్రి (పాత నల్లగొండ) జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు వేర్వేరు వర్గాలుగా ముద్ర పడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పడంతో గొడవలు తగ్గే వీలుందంటున్నారు.
ప్రతికూల అంశాలూ ఉన్నాయి
మరో వైపు ఎమ్మెల్యేలకే నియోజవకర్గ పార్టీ పూర్తి బాధ్యతలను అప్పజెప్పడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సభ్యత్వ నమోదులో, గ్రామ కమిటీల ఏర్పాటులో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న నేతల మధ్య గొడవలు ఉన్నాయంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ల వర్గాల మధ్య గొడవలున్నాయి. ఇక, ఆయా పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చి పాత వారిని పట్టించుకోకుండా పోయే ముప్పు ఉందంటున్నారు. మరో పక్క టీఆర్‌ఎస్‌కే చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకుల మధ్య సయోధ్య లేని జిల్లాలు కూడా ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తప్పక పోవచ్చని విశ్లేషిస్తున్నారు.