- ఐదు జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తి.. నేడు మరో ఐదింటి ఎన్నిక
సాక్షి, హైదరాబాద్ : అంతా ఊహించిందే జరిగింది. అధికార టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బుధవారం ఐదు జిల్లాల్లో ఆరుగురు జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరి గింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీల్డ్ కవర్‌లో పంపించిన పేర్లనే ఎన్నికల అధికారులుగా వెళ్లిన మంత్రులు ప్రకటించారు. ఖమ్మం జిల్లా మినహా మిగిలిన 4 జిల్లాల్లో పాత అధ్యక్షులకే తిరిగి అవకాశం కల్పించారు. బుధవారం రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ (తూర్పు, పశ్చిమ) జిల్లా కమిటీల అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఎక్కడా పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరిగిదంటూ పేర్లను ప్రకటించారు.
నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బండా నరేందర్‌రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. ఖమ్మంలో మాత్రం అధ్యక్షుడిగా పనిచేసిన దిండిగాల రాజేందర్‌ను పక్కన పెట్టారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన బుడాన్ షేక్ బేగ్‌ను ఈ సారి జిల్లా అధ్యక్షునిగా నియమించారు. వాస్తవానికి ఖమ్మం లో జిల్లా అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ ఏర్పడింది. టీడీపీ నుంచి వచ్చిన నేతలు అధ్యక్ష పదవి కోసం బాగానే పట్టుబట్టారు. కానీ, మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన బేగ్‌నే అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఇక, కరీంనగర్ అధ్యక్షుడిగా ఈద శంకర్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు కమిటీ అధ్యక్షుడిగా పురాణం సతీశ్, పశ్చిమ కమిటీ అధ్యక్షుడిగా లోక భూమారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నాగేందర్‌గౌడ్‌లు ఎన్నికయ్యారు. గురువారం నిజామాబాద్, వరంగల్ (అర్బన్, రూరల్), మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లా కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.