కరీంనగర్, న్యూస్‌లైన్ : సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి ఆదర్శవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పనిచేస్తుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలోని ప్రతిమా మల్టిప్లెక్స్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఎంపీ వినోద్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకి జిల్లా మొదటినుంచి వెన్నుదన్నుగా నిలిచిందని, ఇప్పుడు కూడా 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అందించి అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. మార్పు కోసం పోరాటం అనే లక్ష్యంతో అభివృద్ధి అనే ఉద్యమంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ , తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎన్నికల హామీలైన నిరుపేదలకు ఇళ్లు, పింఛన్లు, లక్ష రూపాయల రుణమాఫీలను అమలు చేస్తామన్నారు.
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం 20 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గన్నీ సంచులు, లారీలు ఏర్పాటు చేసి త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై సివిల్ సప్లయ్స్ ఎండీతో మాట్లాడతామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో తాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌సింగ్, చల్లా హరిశంకర్, బోనాల శ్రీకాంత్, నేతికుంట యాదయ్య, పెద్దపల్లి రవీందర్, కఠారి రేవతిరావు, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, కట్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేల బృందం
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్ తదితరులు బుధవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కలిసి వినతిపత్రం అందించారు. కొనుగోళ్లు ఆలస్యమై కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. మిగతా ధాన్యాన్ని గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఎమ్మెల్యేలకు సన్మానం
కలెక్టరేట్ : ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య సన్మానించారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పుట్ట మధుకర్ బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదర్శపాలన అందిస్తాం
Published Thu, May 22 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement