టీఆర్‌ఎస్‌ది అప్రజాస్వామిక చర్య
చిన్నారెడ్డిపై దాడిని నిరసిస్తూ గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై అధికారపార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామిక చర్య అని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం చిన్నారెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ, సీఎల్పీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ను కలిశారు.
చిన్నారెడ్డిపై జరిగిన దాడి, అధికారపార్టీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా నరసింహన్‌కు వివరించారు. ఎమ్మెల్యేపై దాడిచేసిన వారిపై విచారణ జరిపి కఠినంగా వ్యవహరించేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, భాస్కర్‌రావు, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్ తదితరులు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు.
ఇది దుర్దినం : చిన్నారెడ్డి
30 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో తనపై దాడి జరిగిన రోజు తన జీవితంలో దుర్దినమని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి బెదిరిపోనని హెచ్చరించారు.
పార్లమెంటరీ సెక్రటరీలను వెంటనే తొలగించాలి: గుత్తా
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వారిని కొనసాగిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్టు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుండా న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపిం చారు. వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ చ్చి వారిని తొలగించేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.
లోక్‌సత్తా ఖండన
కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడాన్ని లోక్‌సత్తా తెలంగాణ పార్టీ తీవ్రంగా ఖండించింది. చిన్న ప్రొటోకాల్ వివాదం దాడికి దారితీయడం కేవలం టీఆర్‌ఎస్ అధికార అహంభావాన్ని తెలియజేస్తున్నదని లోక్‌సత్తా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హింసాపూరితమైన వాతావరణాన్ని సృష్టించడం టీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు.