సాక్షి, హైదరాబాద్: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల్లో అధికార టీఆర్‌ఎస్ దూకుడు కొనసాగిస్తోంది. గురువారం రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియగా.. కడపటి వార్తలందే సమయానికి 740 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంట్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు 603 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ విడతలో 4,135 గ్రామ పంచాయతీలకు, 36,602 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు 28 పంచాయతీలకే పరిమితమయ్యారు. మరో 45 గ్రామ పంచాయతీలను స్వతంత్రులు, తటస్థులు కైవసం చేసుకున్నారు. రెండోవిడతలో 4,135 పంచాయతీలకు గానూ 25,419 నామినేషన్లు.. 36,602 వార్డులకు 91,458 నామినేషన్లు వచ్చాయి. ఈనెల 25న ఈ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. తొలివిడతలో 769 పంచాయతీలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇందులోనూ టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది.
తుది పోరులో..
గ్రామ పంచాయతీ మూడో విడత పోరులో 4,115 పంచాయతీలు, 36,718 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ల పరిశీలన నిర్ణయాలపై అప్పీళ్లను 20న స్వీకరించి 21లోగా పరిష్కరించనున్నారు. 22తో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment