బల్దియాపై గులాబీ గురి! | TRS Plans For Upcoming Municipal Elections In Kamareddy | Sakshi
Sakshi News home page

బల్దియాపై గులాబీ గురి!

Published Wed, Aug 7 2019 11:36 AM | Last Updated on Wed, Aug 7 2019 11:36 AM

TRS Plans For Upcoming Municipal Elections In Kamareddy - Sakshi

కామారెడ్డి పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బల్దియాలపై టీఆర్‌ఎస్‌ కన్నేసింది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటోంది. కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అభివృద్ధి పనుల పేరుతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. జిల్లాలోనే కీలకమైన కామారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ నామమాత్రంగానే ప్రభావం చూపుతూ వచ్చింది. మున్సిపల్‌ను సొంతంగా ఏనాడూ కైవసం చేసుకోలేక పోయింది.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తరువాత వచ్చిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తరువాత జరిగిన ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. గత ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ మున్సిపల్‌ను కైవసం చేసుకోలేకపోయింది. తరువాత జరిగిన పరిణామాలతో చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్మన్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మెజారిటీ కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పుడు బల్దియా టీఆర్‌ఎస్‌ వశమైందే తప్ప సొంతంగా కైవసం చేసుకోలేకపోయింది. అయితే, ఈ సారి ఎలాగైనా మున్సిపల్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల్లో గుర్తింపు ఉన్న ద్వితీయ శ్రేణి నేతలందరికీ ఇప్పటికే పార్టీ కండువా కప్పి వారిని తన వెంట తిప్పుకుంటున్నారు.

గతంలో 33 వార్డులు ఉండగా, ఇప్పుడు 49 వార్డులు అయ్యాయి. మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడం ద్వారా మున్సిపల్‌పై తమ పార్టీ జెండా ఎగురవేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌.. అందుకు అనుగుణంగా పట్టణంలో అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో వార్డుల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.48 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తాజాగా రూ.15 కోట్లు మంజూరు చేశామని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.

అభివృద్ధి పనుల జోరు.. 
కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందే పనులు పూర్తి చేయడం ద్వారా పట్టణ ప్రజల మద్దతు పొందడానికి ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ జిల్లాలు ఏర్పాటు చేసినపుడు కామారెడ్డిని జిల్లాగా ప్రకటించింది. జిల్లాగా అవతరించిన కామారెడ్డి పట్టణం అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. జిల్లా కేంద్రం కావడంతో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే పట్టణాన్ని విస్తరించారు. సమీప గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ పరిధి విస్తృతమైంది. మున్సిపల్‌ శాఖ ద్వారా భారీ ఎత్తున నిధులు తీసుకొస్తూ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను వేగవంతం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడే లోపు పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే, మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

మున్సిపల్‌ కైవసం సవాలే!
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా కామారెడ్డి బల్దియాపై గులాబీ జెండా ఎగురలేదు. అయితే, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండడం, అన్ని స్థాయిల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉండడంతో పాటు అభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతుండడంతో ఎలాగైనా మున్సిపల్‌ను కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా కేంద్రంలో ఇతర పార్టీల కన్నా కేడర్‌ ఎక్కువగా ఉన్నందున మెజారిటీ వార్డులను గెలుచుకుని బల్దియాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అయితే, ఏ మేరకు సక్సెస్‌ అవుతారో వేచిచూడాలి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement