సింగరేణిలో గులాబీ జెండా! | TRS related tbgks wins in Singareni elections | Sakshi
Sakshi News home page

సింగరేణిలో గులాబీ జెండా!

Published Fri, Oct 6 2017 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

TRS related tbgks wins in Singareni elections - Sakshi

సాక్షి, కొత్తగూడెం, నెట్‌వర్క్‌
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో అత్యధికంగా 1,112 మందికి గాను 1,095 మంది (98.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని ఏరియాల్లో సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. అత్యధిక ఏరియాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్‌ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం  మిగతా ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తుది ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి.

ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు..

  • కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు పోల్‌కాగా.. ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయదుందుభి మోగించింది.
  • ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది.
  • మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది.
  • బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది.
  • కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.
  • శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
  • మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ  800 ఓట్ల మెజార్టీతో గెలిచింది.
  • భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
  • రామగుండం–1లో 6,876 ఓట్లకుగాను 6,476 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 366 ఓట్ల మెజార్టీతో విజయం.
  • రామగుండం–2లో 4,221 ఓట్లకుగాను 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 764 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.
  • రామగుండం–3లో 5,367 ఓట్లకుగాను 5,004 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

రెండింటి మధ్యే పోటీ..
మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌), సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ)ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్‌ తరఫున టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు పథకాలను ప్రకటించడంతో పరిస్థితి టీబీజీకేఎస్‌ వైపు మొగ్గింది. వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లోకి వలసలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement