ఆర్డినెన్స్‌పై సుప్రీంకు టీఆర్‌ఎస్ | TRS to Approach Supreme Court on Polavaram Ordinance | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌పై సుప్రీంకు టీఆర్‌ఎస్

Published Thu, May 29 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

TRS to Approach Supreme Court on Polavaram Ordinance

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తేనున్న ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ విషయంలో హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది.

తెలంగాణ ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ తెస్తే న్యాయపోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా పార్టీ ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం ఢిల్లీలో పలువురు సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యారు. ఈ అంశంపై కోర్టులో ప్రత్యేక పిటిషన్ వేసే విషయమై చర్చలు జరిపారు. ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్నందున, అవి ముగిసిన వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అంతకుముందు కేంద్ర హోం శాఖ అధికారులతోనూ వినోద్ భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌ను తీసుకురావద్దని కోరినట్లు తెలిసింది. ఆర్టికల్ 3ని కాదని ఓ రాష్ట్ర పరిధిలోని ప్రాంతాన్ని మరో రాష్ర్టంలో కలపడం కుదరదని వారితో చెప్పారు. అయితే దీనిపై హోంశాఖ అధికారులు ఎలా స్పందించారన్నది తెలియరాలేదు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. మరో 4 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సమయంలో ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం సరికాదన్నారు. ఇరు ప్రభుత్వాలతో చర్చించాకే దీనిపై ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement