విద్యార్థులపై టీఆర్‌ఎస్ శ్రేణుల పిడిగుద్దులు
సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో మంత్రుల పర్యటనలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై టీఆర్‌ఎస్ శ్రేణులు పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల సాక్షిగా విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ వద్ద మంగళవారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపనకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్ వచ్చారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు కొందరు మంత్రుల ఎదుటకు వెళ్లి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న టీఆర్‌ఎస్ నాయకులు వారిపై పిడిగుద్దులు కురి పిస్తూ, కిందపడేసి తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా పట్టించుకోకుండా దాడి చేశారు. వెంట పడి మరీ చితకబాదారు. కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిపై సైతం టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు.
కేసులు వద్దన్న మంత్రి: నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలపై కేసులు వద్దని మంత్రి కేటీఆర్ సభాముఖంగా సిరిసిల్ల డీఎస్పీని కోరారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు రూ.1,575 కోట్లలో ఇప్పటికే సీఎం రూ.500 కోట్లు విడుదల చేశారన్నారు.