సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నింబంధనను తొలగించటాన్ని అడ్డుకోవాలని గవర్నర్ తమిళిసైను బీజేపీ నాయకులు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి కలిశారు. అనంతరం కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ మైనింగ్‌పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండు విషయాలపై గవర్నర్‌ను కలిసినట్లు, గ్రానైట్‌పై జరుపుతున్న అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 2008 నుంచి 2011 నాటికి ఎనిమిది క్వారీలలో అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారులు అంతకుమించి తవ్వకాలు జరిపారని ఎంపీ విమర్శించారు.
ఈ విషయంపై రానున్న రోజుల్లో కోర్ట్‌ను సైతం ఆశ్రయిస్తామని, అక్రమ మైనింగ్ సంబంధించి వేసిన ఫైన్ రూ. 749 కోట్లు బకాయిలు కట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మైనింగ్ తవ్వకాలు చేస్తూ.. కార్మికుల ఇవ్వాల్సిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని, గ్రానైట్, మైనింగ్ విషయంలో గతంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. మైనింగ్ పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment