సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ 12 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
అయితే ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహణ నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శిని తప్పించి.. ఆ బాధ్యతలను జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. కాగా, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు పేర్కొంది.
మరోవైపు ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మరికాసేపట్లో తమ నివేదికను సమర్పించనుంది. ఇంటర్మీడియట్ ఫలితాల వైఫల్యాలపై పూర్తి స్థాయిలో పరిశీలించిన కమిటీ సుదీర్ఘ నివేదికను రూపొందిచినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment