ఇన్నాళ్లు ఆసరా పింఛన్లు పోస్టాఫీసు ద్వారా ఇచ్చేవారు. ఈ పద్ధతికి పులిస్టాప్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇకనుంచి వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు త్వరగా ఇవ్వాలని ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్‌లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉమ్మడి జిల్లాలో 4,21,008 మంది పెన్షన్‌దారులు ఉన్నారు.
నల్లగొండ : ఆసరా పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి..! పింఛన్ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సమస్యల వల్ల పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల మార్గాన్ని ఎంచుకుంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం రెండు నెలలకోసారి పింఛన్‌లు పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులు ఒక నెల పింఛన్, మరొక నెలలో తీసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నెల పింఛన్ ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది. ప్రతి నెల మొదటివారంలో చేతికందాల్సిన పింఛన్ ఆలస్యం కావడంతో నెలాఖరు వరకు ఎదరుచూడాల్సి వస్తోంది. అదీగాక పింఛన్ల కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి కష్టాల నుంచి గట్టేక్కేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు మండలాల్లో అయితే ఎంపీడీఓలకు, పట్టణాల్లో మున్సిపల్ క మిషనర్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు.
అన్నీ ఆధారాలు తప్పనిసరి...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,21,008 మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెల నల్లగొండ జిల్లాలో రూ.23.33 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.17.19 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.9.90 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయడం ఉండదు కాబట్టి బ్యాంకుల్లో ఆర్థికలా వాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు మాత్రమే అధికారులకు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలి. ప్రధానంగా లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమకాగానే ఆ సమాచారం లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటిదాకా ఈ సెల్‌నెంబరు అనేది లేకపోవడంతో వికలాంగులు, మరికొంత మంది లబ్ధిదారులు నష్టపోవడం జరిగింది. వికలాంగుల సదరమ్ సర్టిఫికెట్ గడువు ముగిశాక, మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందే వరకు (రీ అసెస్‌మెంట్) పింఛన్‌లు పంపిణీ చేయరు. తిరిగి సర్టిఫికెట్ పొందాక ఆగిపోయిన పింఛన్లు (ఎరియర్స్) పంపిణీ చేస్తారు. అయితే చాలా మంది వికలాంగులు ఈ విషయం తెలియక నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయాలనుకోవడం, ఆ సమాచారాన్ని లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరవేయడంతో మేలు జరుగుతుంది.
ఈ సారైనా అమలయ్యేనా..!
పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారా చేయాలన్న ఆలోచన పాతదే. 2008–09లో మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే చెల్లించారు. వివిధ కారణాల దృష్ట్యా మళ్లీ పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పింఛన్‌దారులను బ్యాంకుల వైపునకు మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ ఆచరణలో సాధ్యం కాకపోవడంతో పోస్టాఫీసులనే కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండటం, పలు చోట్ల పింఛన్ నిధులు దుర్వినియోగం అవుతుండటంతో బ్యాంకులైతేనే శ్రేయస్కరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మేనెల నుంచే బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం
ఆసరా చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్‌లకు తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం. మే నెల నుంచి పింఛన్ చెల్లింపులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. సెల్‌నంబరు, ఆధార్‌కార్డు తప్ప నిసరి.
– రింగు అంజయ్య, డీఆర్‌డీఓ
Comments
Please login to add a commentAdd a comment