సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నతవిద్య పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అప్రమత్తమైంది. డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు దొర్లకుండా చూడటంతోపాటు ఫలితాల్లో పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీ చర్యలు చేట్టాలని నిర్ణయించింది. అలాగే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను పక్కాగా అమలు చేయడంతోపాటు డిగ్రీ కోర్సుల్లో ఒకే రకమైన గ్రేడింగ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం అమలు చేయడంతోపాటు పరీక్షల మూల్యాంకన కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించాలని యూనివర్సిటీల వీసీలకు స్పష్టం చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి అంశాలపై యూనివర్సిటీలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పేర్కొంది. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే సంబంధిత లెక్చరర్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించి అమలు చేయాలని పేర్కొంది.
గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వీసీలతో పరీక్షల సంస్కరణలపై సమీక్ష సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను పాపిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిదాల ఘటన తర్వాత యూనివర్సిటీల్లో పరీక్షల విధానంపై సమీక్షించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు పలు సంస్కరణలు తేవడంతోపాటు భవిష్యత్తులో మరింత పక్కాగా ఉండేందుకు కార్యాచరణపై నివేదిక అందజేసేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాయన్న, మహత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్‌లతో కమిటీని ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు...
- పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలి.
- జవాబుపత్రాల మూల్యాంకనానికి యూనివర్సిటీలవారీగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని అమలు చేయాలి. రోజుకు ఎన్ని పేపర్లు దిద్దాలి అన్న దానిపైనా స్పష్టత ఇవ్వాలి.
- అధ్యాపకులు వ్యాల్యుయేషన్ సరిగ్గా చేస్తున్నారా లేదా? అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి.
- వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించాలి. కాన్ఫిడెన్షియల్ వర్క్‌లో పాల్గొనే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. బాధ్యతలను అప్పగించాలి.
- వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాలి.
- ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జంబ్లింగ్ విధానం అమలు చేయాలి. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే అవసరమైతే సెల్ఫ్ సెంటర్లు ఇవ్వాలి.
- పరీక్షల సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌ల ద్వారా పర్యవేక్షణను కొనసాగించాలి.
- అన్ని యూనివర్సిటీలు... విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారి జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. వాటి అమలు, పర్యవేక్షణ కోసం ప్రతి యూనివర్సిటీలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలి.
- వైస్ చాన్సలర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ప్రక్రియలను పర్యవేక్షించాలి. తద్వారా పరీక్షల నియంత్రణాధికారులు, సహాయక పరీక్షల నియంత్రణాధికారులపై భారం పడుకుండా చూడాలి.
- ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ సరిగ్గా ఉన్నాయా? లేదా? సర్వీసు ప్రొవైడర్ సరిగ్గా చేస్తున్నారా? లేదా? ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఫలితాలు ఇవ్వాలి.
- ప్రథమ సంవత్సరంలో మార్కులు ఎక్కువ వచ్చి ద్వితీయ సంవత్సరంలో బాగా తగ్గితే వాటిని క్రాస్‌చెక్ చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలి.
- వ్యవస్థపై నమ్మకం పోకుండా పిల్లలకు నష్టం కలగకుండా చూసుకోవాలి.
- ఫలితాల్లో పొరపాట్లు దొర్లితే వెంటనే సవరించుకునేలా చర్యలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment