
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 31 జిల్లాలవారీగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ కేటగిరీ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉంటే అభ్యర్థులు ఆయా కేటగిరీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాత పరీక్షలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికనుబట్టి రాత పరీక్ష తేదీలను ఖరారు చేస్తామన్నారు. వీలైతే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగానే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటా...
ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా ఎక్కువ పోస్టులు ఉన్న ఇతర జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటాలో పోస్టుల కోసం ఆయా జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది. దీంతో అభ్యర్థులు స్థానిక జిల్లాలో అవకాశాన్ని కోల్పోయే వారు. పైగా ఆ ఒక్క జిల్లాలో ఓపెన్ కోటాకే అర్హులయ్యే వారు. సొంత జిల్లాలోని పోస్టులకు పరీక్ష రాస్తే.. ఇతర జిల్లాలో 20 శాతం ఓపెన్ కోటాకు పరీక్ష రాసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆందోళన అవసరమే లేదు. ఎక్కడ పరీక్ష రాసినా.. సొంత జిల్లాతోపాటు మిగతా అన్ని జిల్లాల్లోని 20 శాతం ఓపెన్ కోటా పోస్టులకు ప్రతి ఒక్కరూ అర్హులే. అప్షన్ ఇచ్చుకుంటే చాలు.. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సొంత జిల్లాలోని పోస్టులతో పాటు మిగతా అన్ని జిల్లాల్లోని ఓపెన్ కోటా పోస్టులకు ఆ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారు. మెరిట్ ఉంటే ఇతర జిల్లాల్లో ఎక్కడైనా పోస్టును పొందవచ్చు. గతంలో మాదిరి ఓపెన్ కోటా పోస్టుల కోసం సొంత జిల్లాలో వదులుకొని ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరమే లేదు.
ఉదాహరణకు...
వరంగల్ అర్బన్ జిల్లాలో 22 పోస్టులే ఉన్నాయి. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 319 పోస్టులు ఉన్నాయి. అంటే అక్కడ ఓపెన్ కోటాలో దాదాపు 60 పోస్టులు ఉంటాయి. ఇలాంటప్పుడు వరంగల్ అర్బన్‌లోని 22 పోస్టుల్లో ఓపెన్ కోటాలో, లోకల్ కోటాలో పోస్టు రాకపోతే.. సదరు అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్‌ను బట్టి అతని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఇతర జిల్లాల్లోని ఓపెన్ కోటాలో ఎక్కడైనా పోస్టు వస్తుందా? పరిశీలించి.. వస్తే ఆ పోస్టుకు ఎంపిక చేస్తారు.
టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్‌పీ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించి ఉండాలి. నియామకాల్లో ఆ టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. రాత పరీక్షను 80 మార్కులు 160 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఖరారు చేసిన సిలబస్ మేరకు ప్రశ్నలు ఉంటాయి. కేటగిరీలవారీగా పోస్టులు, అర్హతలు, సిలబస్ వివరాలను (tspsc.gov.in,www.sakshieducation.com) వెబ్‌సైట్లలో పొందొచ్చు.
సిలబస్ ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించారు. అయితే సైన్స్ మ్యాథ్స్ వంటి వాటిల్లో కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియట్ వరకు లింకేజీ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున కేటాయిస్తారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఒక్కొక్కటిగానే పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ వంటి విధానం ఉండదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు పూర్తిగా> రాత పరీక్ష ఆధారంగానే నియామకాలు ఉంటాయి. దీన్ని 100 మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. వాటికి టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిన అవసరం లేదు.
964 ఇంగ్లిష్ మీడియం పోస్టులు...
రాష్ట్రంలో పలు పాఠశాలల్లో గతేడాది, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినందున ఈసారి ఇంగ్లిష్ మీడియం టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 964 ఇంగ్లిష్ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఏ మీడియం వారికి ఆ మీడియంలోనే రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరు మీడియంలలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు...
– ఎస్‌జీటీ పోస్టులకు 7వ తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
– స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సైన్స్, మ్యాథ్స్‌లలోని కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియెట్ వరకు లింకేజీ ఉంటుంది.
– ఒక అభ్యర్థి నిర్దేశిత అర్హతలు, సంబంధిత మెథడాలజీ ఉంటే ఆయా కేటగిరీలకు చెందిన పోస్టులన్నింటికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు తేదీలు, సమయాల్లోనే రాత పరీక్షలు ఉంటాయి.
– అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 80, ఆన్‌లైన్ ప్రాసెస్ కింద రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
– గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. దీనికి అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
– ఉపాధ్యాయ నియామక నిబంధనలతో కూడిన ఉత్తర్వుల (జీవో 25) ప్రకారమే అర్హతలు ఉంటాయి.
– నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నాటికి అర్హతలు పొంది ఉన్న వారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఇదీ పరీక్ష విధానం...
విషయం మార్కులు ప్రశ్నలు
జనరల్‌నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ 10 20
పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 20
సంబంధిత సబ్జెక్టు(భాష, ఇంగ్లిషు తదిరాలు) 60 120
ఇవీ కేటగిరీలవారీగా పోస్టులు..
స్కూల్ అసిస్టెంట్ – 1941
పీఈటీ – 416
స్కూల్‌అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) – 9
లాంగ్వేజ్ పండిట్ – 1011
సెకండరీ గ్రేడ్ టీచర్ – 5415
మొత్తం – 8,792
మీడియంవారీగా పోస్టులు...
ఇంగ్లిష్ – 964
హిందీ – 516
ఉర్దూ – 900
తెలుగు – 6,303 + 9 (ఫిజికల్ డైరెక్టర్)
కన్నడ – 31
మరాఠీ – 53
తమిళం – 5
బెంగాలీ – 11