టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3, గ్రూపు-4 కేటగిరీలకు చెందిన పోటీ పరీక్షలతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను టీఎస్‌పీఎస్‌సీ ఈనెల 30 న ప్రకటించనుంది.
హైదరాబాద్ : టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3, గ్రూపు-4 కేటగిరీలకు చెందిన పోటీ పరీక్షలతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను టీఎస్‌పీఎస్‌సీ ఈనెల 30 న ప్రకటించనుంది. ఆ సిలబస్‌ను వీలైతే వెంటనే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేనుంది. లేదంటే 31వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. ఆదివారంనాడు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పూర్తి స్థాయి సిలబస్‌ను స్వయంగా ప్రకటించనున్నారు. ప్రధాన పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించాలని, ఆయా పరీక్షలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో సర్వీసు కమిషన్ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ప్రధానంగా గ్రూపు-1 మెయిన్స్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు జోడించారు. ప్రత్యేక రాష్ట్రం అయినందున అన్ని పోటీ పరీక్షల్లోనూ పరీక్షల విధానం, సిలబస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంపైనా గ్రూపు-1, గ్రూపు-2లో ప్రత్యేకంగా పేపర్లను పెట్టారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధం కావాల్సిన కొత్త సిలబస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సర్వీసు కమిషన్ ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. అక్టోబరులో గ్రూపు-2 నోటిఫికేషన్, డిసెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్లను జారీ చేయాలని ఇదివరకే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు పూర్తి స్థాయి సిలబస్‌ను ప్రకటిస్తే అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం ఉంటుందన్న భావనతో ఈ చర్యలు చేపట్టింది.