కొత్త రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మరి లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి?
ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం
నిరాశలో నిరుద్యోగులు.. నోటిఫికేషన్లపై గంపెడాశలు
జనవరి నుంచే మొదలుపెడతామన్న టీఎస్‌పీఎస్సీ
ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని సర్కారు
హామీలిచ్చి.. ఆచరణపై దృష్టి పెట్టని ప్రభుత్వ పెద్దలు
విభజన సమస్యలు, హేతుబద్ధీకరణ పేరుతో కాలయాపన
జిల్లా స్థాయి పోస్టుల భర్తీని కూడా పక్కనబెట్టిన వైనం
గ్రూప్స్ సిలబస్ మార్పులపైనా ఎటూ తేల్చని సర్కారు
కేబినెట్ ఆమోదించిన వాటికీ జారీ కాని నోటిఫికేషన్లు
అంతులేని జాప్యంతో ఉద్యోగార్థుల్లో నిర్వేదం
కొత్త రాష్ర్టంలో లక్ష ఉద్యోగాల భర్తీ..
ఉద్యోగుల పంపిణీ పూర్తి కాగానే ఖాళీ పోస్టులు ప్రకటిస్తాం..
ఖాళీలపై స్పష్టత రాలేదు. లెక్క తేలాక నియామకాలు చేపడతాం..
- వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్
త్వరలో 5 లక్షల ఉద్యోగాల భర్తీ
- మీడియాతో ఎంపీ కేశవరావు
కొత్త ఏడాదిలో కొత్త కొలువులు.. త్వరలో నోటిఫికేషన్లు
- టీపీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటన
ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. విభజనతో సంబంధం లేకుండా జిల్లా, జోనల్,
మల్టీ జోనల్ స్థాయిలో 85 శాతం ఖాళీలు ఉన్నాయి.
- అసెంబ్లీ సాక్షిగా మంత్రులు హరీశ్, ఈటల
ఈ ప్రకటనలన్నీ వివిధ సందర్భాల్లో రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు.. వాగ్దానాలు. కొత్త రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మరి లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి? ఖాళీ పోస్టుల ప్రకటన ఇంకెప్పుడు? నియామకాలు చేపట్టేదెన్నడు? సర్కారీ కొలువుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల మౌన వేదన ఇది. భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ జనవరి నుంచే నోటిఫికేషన్లు మొదలవుతాయని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఏప్రిల్ ముగుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగుల విభజన పేరుతో సర్కారు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. విభజనతో సంబంధం లేని పోస్టుల భర్తీ విషయంలోనూ సర్కారు శ్రద్ధ చూపకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశలో మునిగిపోతున్నారు. ఇక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులుంటాయన్న అధికారులు.. కనీసం ఆ వివరాలను ఇప్పటికీ ప్రకటించకుండా ఉద్యోగార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు ఆలస్యంగా వచ్చినా.. ఆలోగా తగిన శిక్షణతో సన్నద్ధం కావాలనుకుంటున్న యువతకు నిర్వేదమే మిగులుతోంది.
ఎందుకీ కాలయాపన?
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పోస్టుల భర్తీకి అనుసరించే సిలబస్‌ను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయడం లేదు. పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ గతంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ)కు నివేదిక ఇచ్చింది. దాన్ని సర్కారుకు పంపి కూడా రెండు నెలలు కావస్తోంది. అయినా సిలబస్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్ల జారీని ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన పోలీస్ కానిస్టేబుల్, నీటిపారుదల, విద్యుత్ శాఖల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీ విషయంలోనూ పురోగతి లేదు.
గత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల భర్తీ వేగవంతమవుతుందని నిరుద్యోగులు ఆశించారు. జనవరి నుంచే నోటిఫికేషన్లు మొదలవుతాయని కమిషనూ ప్రకటించింది. మళ్లీ ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో కొన్నేళ్లుగా సర్వస్వం ధారపోస్తూ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న యువత ఆందోళనకు గురవుతోంది. కనీసం విభజనతో సంబంధం లేని పోస్టులనైనా భర్తీ చేసి ఊరట కల్పించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అలాంటి ఖాళీ పోస్టులు ఇప్పటికిప్పుడు 76,548 ఉన్నాయి. ఇవన్నీ జిల్లా స్థాయి పోస్టులే. అయినా ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
టీచర్ పోస్టులపై గందరగోళం
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని విద్యా శాఖ వర్గాలు చెబుతుండగా, దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు మాత్రం డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో స్కూళ్లలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని సర్కారు భావిస్తోంది. తద్వారా ఉన్న ఉపాధ్యాయులనే అవసరమైన చోట సర్దుబాటు చేసే ప్రణాళికలపై దృష్టి పెట్టింది. దీంతో కొత్త పోస్టుల భర్తీకి అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యా శాఖ తాజాగా లెక్కలు వేసింది. మరి వీటిని ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకం.
లెక్చరర్ పోస్టులకు మరో లంకె!
లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రా క్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వాటన్నింటినీ డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో నేరుగా నియామకాలు చేపట్టే పోస్టుల్లోనూ కోత పడే అవకాశముంది. ఇక వీటి భర్తీ సంగతేంటో సర్కారుకే తెలియాలి.
చిక్కుల్లో 20,591 పోస్టులు
ఉద్యోగుల విభజన తర్వాతే రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, విభాగాధిపతి కార్యాలయాల్లోని 20,591 ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లను పునర్వ్యవస్థీకరించాలన్న వాదన ఉంది. ఈ ప్రక్రియను కూడా చేపడితే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 371(డి) అధికరణానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. అందుకే ప్రస్తుత జోన్లను యథావిధిగా కొనసాగిస్తూ, విభజన పూర్తి కాగానే చేయాలని కోరుతున్నారు.
- సాక్షి, హైదరాబాద్