సాక్షి, రాయపర్తి : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు బైక్‌పై వెళ్తున్న రాణి సోదరి కవిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈనేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. డ్రైవర్ ఇరుకైన మార్గం గుండా పోనిచ్చేందుకు యత్నించాడు. ఆ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసరించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో.. ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు కొట్టేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్!
Published Wed, Feb 26 2020 2:17 PM | Last Updated on Wed, Feb 26 2020 2:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment