కుటుంబ సభ్యులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేస్తున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, జనగామ: దండం పెడుతున్నం.. కాళ్లు మొక్కు తం.. రూ. వెయ్యికి ఆశపడి ఉద్యోగానికి రాకండి అప్పుడే ప్రభుత్వానికి శక తగులుతుందని ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక ఉద్యోగులకు వేడుకున్నారు. మా పోరాటం భవిష్యత్‌లో మీ కోస మే.. మా బాధను చూస్తున్నారు.. ఆగ్రహాన్ని చూస్తే డిపోలో కాలుకూడా పెట్టలేరని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. ఆర్టీసీ సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకోగా కార్మికులు కుటుంబ సభ్యులతో జనగామ డిపో గేటు ఎదుట భైఠాయించారు. బస్సులను బయటకు రానివ్వకుండా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఏపీ ముఖ్య మంత్రి జగనన్న అచ్చాహై అంటూ నినాదాలు చేస్తూ కార్మికుల పిల్లలు నినదించారు. సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు శ్రీనివాస్, రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టారు. కార్మికులు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు ముందుగానే గేట్లు మూసేశారు.
రెండు గంటల పాటు బైఠాయింపు
ఆర్టీసీ కార్మికులు కుటుంబసభ్యులతో డిపో గేటు ఎదుట రెండు గంటల పాటు భైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. నియంత పాలనలో ఆర్టీసీని కనుమరుగు చేస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపణలు గుప్పించారు. ప్రైవేట్‌పరం చేస్తే టికెట్‌కు అడిగినంత డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తుంటే.. కొంతమంది నిరుద్యోగులు డబ్బులకు కక్కుర్తి పడి తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ తమను ఆకలితో చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.వెయ్యా...లేక టికెట్‌పై అదనపు వసూళ్ల కోసం వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ మా మాట వినకుంటే కార్మిక కుటుంబాల ఉసురు తగిలిపోతారని శాపనార్దాలు పెట్టారు. డిపో నుంచి ర్యాలీగా బస్టాండు ఆవరణకు చేరుకుని మానవహారం నిర్వహించి అవుట్ గేట్ వద్ద కాసేపు ధర్నా నిర్వహించారు.
వాగ్వాదం..
పలు డిపోలకు చెందిన బస్సు సర్వీసులు బస్టాండుకు రాగా తాత్కాలిక, ఆర్టీసీ కార్మికులకు మాటల యుద్ధం కొనసాగింది. కండక్టర్లు, డ్రైవర్లకు దండంపెట్టి.. ఉద్యోగాలకు రావద్దని వేడుకుంటుండగా.. మా ఇష్టం అంటూ మాట్లాడడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాత్కాలిక కండక్టర్ ఆర్టీసీ కార్మికులపైకి రావడంతో అంతా ఒక్కటయ్యారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. అక్కడి నుంచి ర్యాలీగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. నేడు ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ముఖాముఖి చర్చలు కొనసాగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment