
సాక్షి, నిర్మల్ : విధుల్లోకి వెళ్తున్న భైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయనపై ముసుగు వేసి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కాంత్ డిమాండ్ చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 32వ రోజుకు చేరింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు విధించిన డెడ్‌లైన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది.
(చదవండి : డిమాండ్లపై మల్లగుల్లాలు!)
కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నామని, మంగళవారం నాటికి విధ్లుల్లోకి చేరాలని సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. లేనిపక్షంలో మిగిలిన 5 వేల రూట్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. పెద్దపల్లి జిల్లా కుచిరాజుపల్లిలో ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ నుంచి మంథని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డీఎంపై దాడితో మాకు సంబంధం లేదు : అశ్వత్థామరెడ్డి
భైంసా డిపో మేనేజర్‌పై దాడితో ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అధికారిపై దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తోందని పేర్కొన్నారు. గత 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెలో భాగంగా నేడు అన్ని డిపోల వద్ద మానవహారాలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment