తుగ్లక్ పాలనను మరిపిస్తున్న కేసీఆర్
కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను మరిపిస్తుందని, అనాలోచిత నిర్ణయాలతో వివాదస్పద మాటలతో కేసీఆర్ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద బుధవారం రాజీవ్ రహదారి దిగ్భందం, వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసిందని, భూసేకరణ పూర్తయిందని, నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇంతలోనే రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం యోచించడం శోచనీయమని అన్నారు.
కాంగ్రెస్ హయూంలో చేపట్టిన ప్రాజెక్టులను వివాదస్పదం చేస్తూ సీఎం కేసీఆర్ రోజుకో మాటమాట్లాడటం తగదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసే యోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రిజర్వాయర్ పరిధిలోని ప్రజలకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయ చర్యలకు చేపట్టకుండా... కేంద్రానికి నివేదిక అందించకుండా రైతులను దగా చేస్తున్నాడని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ హయూంలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలను పరామర్శించాలనే సోయి లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని భావించిన ప్రజల ఆశలు అడియాశలు ఆయ్యాయని, యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు.
తోటపల్లితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సొంతూరు పేరుతో నిర్మిస్తున్న తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేస్తుంటే ఆయన సిగ్గుపడాలన్నారు. రాజీవ్హ్రదారి దిగ్బంధం అంతం కాదని, ఆరంభమేనని అన్నారు. కేసీఆర్‌కు జేజేలు కొట్టిన జిల్లా ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద మాట్లాడుతూ...
తలాతోక లేని విధానాలతో ప్రజలను మభ్యపెట్టడం కేసీఆర్‌కు నిత్యకృత్యంగా మారిందని అన్నారు. జిల్లా మంత్రులు కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించకపోతే రానున్న రోజుల్లో ముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, బొమ్మ వెంకన్న, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కొమొరెడ్డి రాములు, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బాబా సలీంపాషా, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, తోటపల్లి భూనిర్వాసితుల పోరాట సమితి కన్వీనర్ సిహెచ్.జనార్దన్‌రెడ్డి, తోటపల్లి రిజర్వాయర్ సాధన సమితి కన్వీనర్ కెడం లింగమూర్తితో పాటు రెండు వేల మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఉత్తమ్ సహా నాయకుల అరెస్టు
రాజీవ్ రహదారి దిగ్బంధం, వంటవార్పు తరువాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మధ్యాహ్నం 3.50 గంటలకు పోలీసులు వలయంగా ఏర్పడి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నేరెళ్ల శారదతో పాటు మాజీ ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్
స్టేషన్‌కు తరలించారు.