
హరితహారానికి 20 రోజులు
రాష్ట్రవ్యాప్తంగా 17 కోట్ల మొక్కలు నాటించిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత హరితహారం బుధవారంనాటికి 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 కోట్లకుపైగా మొక్కలు నాటారు. తొలి రెండు వారాల్లోనే 46 కోట్ల మొక్కలు నాటనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రకటించినా ఆశించినంత వేగంగా సాగడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలం ముగిసేలోగా లక్ష్యానికి అనుగుణంగా 46 కోట్ల మొక్కలు నాటనున్నట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.
మొక్కల సంరక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాలు, గ్రామ కార్యదర్శులు, హరిత రక్షణ కమిటీలకు అప్పగించడంతో ఫలితాలు మెరుగయ్యాయి. మొక్కలు నాటడంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు 2 కోట్ల మార్కు దాటాయి. మంగళవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో 2.55 కోట్లు, ఆదిలాబాద్‌లో 2.42 కోట్లు, ఖమ్మంలో 2.29 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీశాఖ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో తక్కువ సంఖ్యలో 75 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.
సరిపడాలేని పండ్ల మొక్కలు
ప్రజల నుంచి పండ్ల మొక్కలకు భారీగా డిమాండ్ ఉండడంతో సరిపడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. 9 జిల్లాల నుంచి 60 లక్షల పండ్ల మొక్కల డిమాండ్ వచ్చినప్పటికీ, 28 లక్షల మొక్కలు ఇవ్వడానికి అటవీశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ 18 లక్షల మొక్కలు మాత్రమే సరఫరా చేయగలిగింది. రాష్ట్రంలోని సుమారు 300కుపైగా ఉన్న నర్సరీల్లో 1.40 కోట్ల పండ్ల మొక్కలు అందుబాటులో ఉండగా, తొలివిడత 51 నర్సరీల నుంచి 10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని వచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు తంటాలు పడుతున్నారు.