
మంగళవారం ధర్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఆర్టీసీ బస్సు
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
- క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మహేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ధర్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడికి చెందిన సుంకరి బాలమ్మ (28), కొడుకు అజయ్ (4 నెలలు)తో కలసి బస్సు ఎక్కింది. వీరితో పాటు మరికల్‌కు చెందిన విద్యార్థి సోహైల్ (14) జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ఎక్కాడు. వీరితో పాటు మక్తల్‌కు చెందిన మరికొందరు బస్సులో ఉన్నారు.
మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కర్ణాటక బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకరి బాలమ్మ, అజయ్, సోహైల్, మరో ప్రయాణికురాలు హసీనాబేగం (45) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు. అలాగే జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్‌కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి విరిగి రోడ్డుపై పడింది. ఈయనతో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.ఐదు వేల చొప్పున అందజేస్తామని, మెరుగైన వైద్యసేవలు అందించాలని స్థానిక వైద్యులకు సూచించారు.