ఇద్దరు రైతుల ఆత్మహత్య
నెట్‌వర్క్: అప్పుల బాధలు, రుణమాఫీపై అనుమానాలు.. విద్యుత్ కోతలు వెరసి రుణదాతలు ఉసురు తీసుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన చాకలి నర్సింహులు(35) తనకున్న రెండెకరాల్లో మూడు బోర్లు తవ్వించాడు. అవి వట్టి పోవడంతో అప్పుల కుప్పగా మారాడు. మరో వైపు మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌లో తనకున్న రూ. 45 వేల రుణం మాఫీ అవుతుందో లేదోనన్న బెంగపట్టుకుంది. ఈ క్రమంలో తన చెరుకుతోటలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొమరారం గ్రామానికి చెందిన రైతు గంగావత్ తారు (40) తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు.
వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవడంతో మరోసారి రెండున్నర ఎకరాల్లో అదే పంట వేశాడు. విద్యుత్ కోతలతో పంటకు నీరందక ఎండిపోయింది. పంట పెట్టుబడికి తోడు పాత రుణం మొత్తం రు. 4 లక్షల వరకు అప్పు అయింది. సోమవారం చేను వద్దకు వెళ్లిన తారు పంట ఎండిపోవడం చూసి, అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకున్నాడు.
రాత్రి కరెంట్‌కు రైతు బలి
ఆత్మకూరు: రాత్రి కరెంట్‌కు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌళ్లపల్లికి చెందిన రైతు బలయ్యూడు. పోలీసుల కథనం ప్రకారం... రాచర్ల భద్రయ్య (50)తనకున్న ఎకరమున్నర భూమిలో పత్తి సాగుచేశాడు. సోమవారం వేకువజామున 3 గంటలకు చీకట్లో పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేసినా... మోటర్ నడవకపోవడంతో సర్వీస్ వైరు చెక్ చేస్తూ వెళుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.