వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు వెల్లడి
వరంగల్, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీలో ఏరియా కమిటీ సభ్యులిద్దరు శనివారం లొంగిపోయినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు రంగారావు తెలిపారు. వీరిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముప్పానపల్లికి చెందిన పాపారావు అలియాస్ రంజిత్, గూడూరు మండలం సీతానాగారం గ్రామానికి చెందిన ఎదుళ్ల భాస్కర్‌రెడ్డి అలియూస్ రామకృష్ణ ఉన్నారు. పాపారావు ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, భాస్కర్‌రెడ్డి గుండాల-నర్సంపేట ఏరియా దళ సభ్యుడిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. కాగా, పాపారావు కమలాపురంలోని బిల్ట్ జీఎం హత్య కేసుతోపాటు ఇంకా పలు కేసుల్లో నిందితుడని చెప్పారు.
చుండూరు నిందితులకు శిక్ష తప్పదు
ఓ టీవీ చానల్‌లో మావోల పేరుతో హెచ్చరిక
గుంటూరు, న్యూస్‌లైన్: చుండూరులో దళితుల ఊచకోతకు పాల్పడిన నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నప్పటికీ.. ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ పేరుతో ఓ టీవీ చానల్‌లో శనివారం వెలువడిన ప్రకటన కలకలం సృష్టించింది. నిందితులను కారంచేడు తరహాలో శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ర్పచారం చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత మీడియా ప్రతినిధికి పోలీసులు ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్నట్టు సమాచారం.