మాటల్లో గారడీ.. ప్రయాణంలో దోపీడీ
సిద్దిపేట రూరల్ : డబ్బును దాచేందుకు ఆటోలో బ్యాంక్‌కు వెళ్తున్న ఓ వృద్ధురాలిని మాటలతో మస్కా కొట్టిన ఇద్దరు మహిళలు నగదును దోపీడీ చేసిన సంఘటన శుక్రవారం సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బక్రిచెప్యాల గ్రామానికి చెందిన మల్లోజి విజయలక్ష్మి గ్రామానికి చెందిన ఓ ఆటోలో తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలను ఓ చేతి సంచిలో పెట్టుకుని సిద్దిపేటలో ఉంటున్న తన కుమారుడి వద్దకు బయలుదేరింది.
ఈ క్రమంలో రాజీవ్ రహదారి పొన్నాల స్టేజీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పురుషులు ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణిస్తున్న విజయలక్ష్మిని మాటల్లో పెట్టి ఆమెకు తెలియకుండానే చేతిలో ఉన్న సంచిని కత్తిరించి అందులో గల రూ. 2.50 లక్షలను అనుమానం రాకుండా నొక్కేశారు. పాత బస్టాండ్ వద్ద అందరూ ఆటో నుంచి దిగారు. అప్పటికే ఆటోలో వస్తున్న విజయలక్ష్మి కోసం తన కుమారుడు అక్కడ సిద్ధంగా ఉండడంతో ఆమెను తీసుకుని డబ్బులను జమ చేసేందుకు పట్టణంలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. డబ్బులను జమ చేసే ఓచర్‌లో పేర్లు రాసి నోట్లు లెక్కించడానికి సంచిని తెరిచి చూడగా అందులోని డబ్బు మాయమైంది.
సంచికి కత్తిరించిన ఆనవాళ్లు కనిపించడంతో బాధితురాలు డబ్బులు దోపిడీకి గురయ్యాయని లబోదిబోమంది. వెంటనే కుమారుడితో కలిసి స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చోరీకి సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వెంటనే పట్టణంలో పోలీసులను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.