ఎప్పుడంటే అప్పుడే పరీక్షలు | UGC Recommends That Students Take a Test When They Are Favorite | Sakshi
Sakshi News home page

ఎప్పుడంటే అప్పుడే పరీక్షలు

Published Thu, Jan 2 2020 1:39 AM | Last Updated on Thu, Jan 2 2020 1:41 AM

UGC Recommends That Students Take a Test When They Are Favorite - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్, బీబీఏ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఆన్‌ డిమాండ్‌ పరీక్షల విధానం భవిష్యత్తులో రాబోతోంది. విద్యార్థులు తాము పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడే పరీక్షలు నిర్వహించే విధానం అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్యానెల్‌ కమిటీ సిఫారసు చేసింది. పరీక్షల నిర్వహణకు విద్యా సంస్థల సంసిద్ధత ముఖ్యం కాదని, విద్యార్థుల సంసిద్ధతే ప్రధానమని స్పష్టం చేసింది. దీని ద్వారా పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గించొచ్చని, మాల్‌ ప్రాక్టీస్‌ను నిరోధించొచ్చని పేర్కొంది. దేశంలో పరీక్షల సంస్కరణలపై కేంద్రం 2018 మేలో భారతీ విద్యా పీఠ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఎంఎం సాలంఖే నేతృత్వంలో యూజీసీ ప్యానెల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏడాదిన్నర కాలంగా పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేసింది. సంప్రదాయ డిగ్రీలు, సాంకేతిక డిగ్రీ, వృత్తి విద్యా డిగ్రీ కోర్సుల్లో పరీక్షలు, పేపరు వ్యాల్యుయేషన్, మార్కుల విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. తాము గుర్తించిన అంశాలను క్రోడీకరించి, పలు సిఫారసులతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రానికి అందజేసింది. ఆన్‌ డిమాండ్‌ పరీక్షల విధానం అమల్లోకి తేవడం వల్ల విద్యార్థులపైనా ఒత్తిడి తగ్గుతుందని, ప్రతిభకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.

ప్రత్యేక క్వశ్చన్‌ బ్యాంకు..
ఆన్‌ డిమాండ్‌ పరీక్షల విధానం అమలుకు ఎక్కువ కృషి అవసరమని ప్యానెల్‌ కమిటీ పేర్కొంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్‌ వినియోగం అవసరమని, క్వశ్చన్‌ బ్యాంకు విధానం ఉండాలని స్పష్టం చేసింది. క్వశ్చన్‌ బ్యాంకును ఏర్పాటు చేసి, వాటి నుంచి ఎప్పుడంటే అప్పుడు ప్రశ్నపత్రాలను తీసుకునేలా ఉండాలని పేర్కొంది. అయితే ఇదీ ఆన్‌లైన్‌ విధానంతో కొంత సులభం అవుతుందని సూచించింది. మరోవైపు ఆన్‌ డిమాండ్‌ పరీక్షల అమలును పర్యవేక్షించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకం గా బోర్డు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐవోఎస్‌) ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే రెగ్యులర్‌ డిగ్రీ కోర్సుల్లో అమలుకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 2,75,54,749 మంది విద్యార్థులు రెగ్యులర్‌ డిగ్రీలు చేస్తుండగా, 26,99,567 మంది దూర విద్యా విధానంలో డిగ్రీలను చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌ డిమాండ్‌ పరీక్షలను ముందుగా దూర విద్యా విధానంలో నిర్వహించేందుకు కోర్సుల్లో యూనివర్సిటీలు ప్రవేశ పెట్టాలని పేర్కొంది. ఆ తర్వాత రెగ్యులర్‌ కోర్సుల్లో అమలు చేయాలని సూచించింది. ఇందులో వయసు, అర్హతలకు సంబంధించిన ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది.

సామర్థ్యాలు, నాలెడ్జి, నైపుణ్యాలే ముఖ్యం..
ప్రస్తుత విద్యా విధానాల్లో సమూల మార్పులు అవసరమని పేర్కొంది. మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. ఉత్తీర్ణత ఒక్కటే ముఖ్యం కాదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని విద్యా సంస్థల నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని బయటకొస్తున్న వారిలో అత్యధిక మంది ఉద్యోగాలకు పనికి రావట్లేదని తెలిపింది. అందుకే ఉత్తీర్ణత ఒక్కటే ముఖ్యం కాదని, అభ్యసనలో ఎంత మేరకు నేర్చుకున్నారు.. ఏ మేరకు సామర్థ్యాలను పెంపొందించుకున్నారు.. విజ్ఞానాన్ని ఎంత మేర సముపార్జించారు.. నైపుణ్యాలను ఏ మేరకు పెంపొందించుకున్నారన్నదే ముఖ్యమని వివరించింది.

ఐఐటీ తరహాలో గ్రేడింగ్‌..
విద్యార్థులకు పరీక్షల్లో వచ్చే మార్కులకు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇచ్చే అబ్జల్యూట్‌ గ్రేడింగ్‌ (పర్సంటేజీ ప్రకారం ఇచ్చే గ్రేడ్‌) కాకుండా రిలేటివ్‌ గ్రేడింగ్‌ లేదా కుమ్యులేటివ్‌ గ్రేడింగ్‌ విధానం ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని ఐఐటీ, ప్రైవేటు యూనివర్సిటీలు కుమ్యులేటివ్‌ గ్రేడింగ్‌ విధానాన్ని (సీజీపీఏ) అమలు చేస్తున్నాయని, ఇందులో విద్యార్థికి సంవత్సరం చివరలో నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ఏడాదిలో పలుసార్లు నిర్వహించే పరీక్షలు, ప్రాక్టికల్‌ పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ఒక రోజు పరీక్షతో విద్యార్థిని అంచనా వేయకుండా, ఏడాది పొడవునా సాధించిన సామర్థ్యాలను అంచనా వేయడం శాస్త్రీయంగా ఉంటుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement