సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ ప్రణాళిక కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జెడ్పీతోపాటు, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఉంది. కాంగ్రెస్, టీడీపీ సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో డీపీసీ ఎన్నిక లాంఛనం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ పదవుల కోసం టీఆర్‌ఎస్‌లోనే అంతర్గత పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు గురువారం సాయంత్రం సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
జిల్లా మంత్రి జోగు రామన్న, జెడ్పీ చైర్‌పర్సన్ శోభాసత్యనారాయణగౌడ్, సీనియర్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ ఎన్నిక విషయమై సమాలోచనలు జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉండేలా.. ఆయా రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలకు వచ్చే నిధుల కేటాయింపులు, అభివ ృద్ధి పనుల ఎంపిక వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన ఈ ప్లానింగ్ కమిటీలో సభ్యులుగా నియామకమయ్యేందుకు టీఆర్‌ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ పదవులను ఆశిస్తున్న నేతలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. తమకు ఎలాగైనా ఈ పదవులు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అధికార పార్టీలోనే ఈ పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌లో సఖ్యత లోపించి, నిర్ణీత సభ్యులకంటే అధిక నామినేషన్లు దాఖలైన పక్షంలో మాత్రం ఎన్నిక అనివార్యం కానుంది.
పార్టీల బలాబలాలు ఇవి...
జెడ్పీలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అయితే అసలు ఆ పార్టీ ఉనికే లేదు. ఒక్క బెల్లంపల్లి బల్దియాలోనే ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో టీడీపీ ఈ డీపీసీ పదవులపై ఆశలు వదులుకుంది. ఇక కాంగ్రెస్ కూడా దాదాపు చేతులెత్తేసింది. ఆ పార్టీకి జిల్లా పరిషత్‌లో పది మంది జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. ఈ పది మందిలో కూడా కొందరు టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపారు. ఇక జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 51 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. దీంతో డీపీసీ రూరల్ నియోజకవర్గం నుంచి గానీ, అర్బన్ నియోజకవర్గం నుంచి గానీ ప్లానింగ్ కమిటీ సభ్యులుగా ఆ పార్టీ ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ..
డీపీసీలో మొత్తం 24 మంది సభ్యులుంటారు. ఇందులో నలుగురు అర్బన్ నియోజకవర్గం (కౌన్సిలర్ల నుంచి ఎన్నికయ్యే వారు) సభ్యులు కాగా, మిగిలిన 20 మంది సభ్యులు రూరల్ నియోజకవర్గం (జెడ్పీటీసీల తరపున ఎన్నికవుతారు) నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16న సాయంత్రం 5 గంటలకు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ సాయంత్రం 5 గంటల సమయం వరకు ఉంటుం ది. 24 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైన పక్షంలో ఈనెల 17న ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఏకగ్రీవం దిశగా..!
Published Thu, Dec 11 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement