వికారాబాద్‌రూరల్: భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఉన్న గిరిజనుల ఖనిజ సంపదను దోచుకునేందుకు ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిసి కుట్ర పన్నుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు. పోలవరం బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం టీజేఏసీ పిలుపు మేరకు వికారాబాద్‌లో బంద్ చేపట్టారు.
పట్టణంలోని ప్రధాన వీధుల గుండా టీజేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు, సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను మూయించివేశారు. బీజేఆర్ చౌరస్తాలో టైర్లను తగులబెట్టారు. అనంతరం అతిథి గృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెండు లక్షల మంది గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలా ఆర్డినెన్‌స తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్రం లోని కొన్ని గ్రామాలను మరో రాష్ట్రలో కలపడం ఎంతవరకు సమంజసమని, ఇది దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.
కేంద్రం ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, శుభప్రద్‌పటేల్, కృష్ణయ్య, ఎల్లారెడ్డి, టీజేఏసీ నాయకులు శ్రీనివాస్, కల్కోడ నర్సింలు, సీపీఎం నాయకులు మల్లేశం, మహిపాల్, అమరేశ్వర్, నాయకులు విజయ్‌కుమార్, ఎర్రవల్లి అబ్దుల్ సత్తార్, కొత్తగడి అశోక్‌రెడ్డి, యాదగిరియాదవ్, సురేష్, శంకర్, శ్రీకాంత్, చంద్రకాంత్‌రెడ్డి, పాండుముదిరాజ్, కిష్టారెడ్డి, గోపాల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బిల్లును వెనక్కి తీసుకోవాలి
పరిగి: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అన్నారు. బిల్లును నిరసిస్తూ శనివారం పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ సర్కార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంద ని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వార్ల రవీంద్ర, ఆనంద్‌గౌడ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, షాహెద్, నయీమొద్దీన్, సమద్, గాంగ్యా తదితరులు పాల్గొన్నారు.