సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. పోలీస్ శాఖకు మాత్రమే యూనిఫాం అలవెన్స్‌ను పెంచడంపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పోలీస్ శాఖలోని సిబ్బందికి యూనిఫాం అలవెన్స్‌ను రూ.3,500 నుంచి రూ.7,500లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ సి బ్బంది యూనిఫాం అలవెన్స్‌ను పెంచుతామ ని ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల క్రితం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మిగతా యూనిఫాం సర్వీసులైన జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని అధికారులు, సిబ్బందిలో అసహనం మొదలైంది. తమకు కూడా పోలీస్ శాఖకు సమానంగా అలవెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
పదో పీఆర్‌సీ ప్రకారం..
హోంశాఖ జారీచేసిన జీవోలో, పదో పీఆర్‌సీ ప్రకారం యూని ఫాం అలవెన్స్‌ను పెంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపిం ది. అందులో భాగంగానే సీఎం హామీతో పాటు డీజీపీ ప్రతిపాదనలమేర అలవెన్సును పెంచినట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇచ్చిన జీవో 12లో స్పష్టం చేసింది. అయితే పదో పీఆర్‌సీ ప్రకారం యూనిఫాం సర్వీసుల్లో తమ అలవెన్స్‌ను కూడా రూ.7,500లకు పెంచాలని జైళ్లు, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. తమ విభాగాల అధిపతులను కలసినా పట్టించుకోవడం లేదం టూ ఆయా సర్వీసుల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూని ఫాం అలవెన్సుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖకు యూనిఫాం అలవెన్స్ కింద వెచ్చిస్తున్న నిధుల్లో తమకు 30% సరిపోతుందని, తాము పోలీస్ శాఖ సిబ్బందికిగానీ, అధికారులకుగానీ వ్యతిరేకం కాదని వారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment