ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా వామపక్షాల ఐక్యసంఘటన
వామపక్ష నేతలు చాడ, తమ్మినేని
దేవరుప్పుల: ఆరు దశాబ్దాలైనా తెలంగాణలో మారని ఆర్థిక, సామాజిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా వామపక్షాల ఐక్యసంఘటన అనివార్యమని సీపీఐ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వర ంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 69వ వర్ధంతి శనివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అనుసరించి సబ్బండ కులాలు, సంఘాల సహకారంతో సాధించిన తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలనగా మార్చారన్నారు.
ఉద్యమాలగడ్డ కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారక భవనం కోసం నిధులు కేటాయింపు చేయకుండా అమరులను అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తూ నిజాంను పొగడడం ఆయన రాజకీయ నీతికే వదిలేస్తామన్నారు. కడవెండి వేదికగా వామపక్షాల ఐక్యసంఘటనను కొనసాగించేలా త్వరలో ప్రజాసమస్యల సాధన దిశగా పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ సాధనకు ఊతం ఇచ్చిన మావోయిస్టులు వామపక్షాల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి తుపాకులు వీడి తోడవ్వాలనీ పిలుపునిచ్చారు.