హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం సమగ్ర సర్వే ప్రకంపనలు స్పష్టించింది. రాష్ట్రాన్ని స్తంభింపజేసి చేసిన సర్వే ఎందుకు ఉపయోగపడిందో చెప్పాలంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సంక్షేమ కార్యక్రమాల కోసమే సర్వే అన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలులో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ప్రశ్నించాయి.
ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అర్హులైన సీమాంధ్రులను.. లబ్దిదారులుగా చేర్చకుంటే వారి తరపున ఎంఐఎం పోరాడుతుందన్నారు. 25 శాతం మంది సమగ్ర సర్వే పరిధిలోకి రాలేదని అక్బరుద్దీన్ అన్నారు. సర్వే పరిధిలోకి రానివారి కోసం మళ్లీ ఎప్పుడు సర్వే నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.