సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు కావాలనుకుంటున్నారా? పుచ్చులులేని, పురుగుమందులు వాడని పండ్లు ఉంటే బావుంటుందని భావిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే వీటిని పండిం చుకోవచ్చు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో కేవలం 200 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు సొంతంగా సాగు చేసుకోవచ్చు. కనీసం 100 చదరపు అడగులున్నా సరే ఇంటిల్లిపాదికీ ఏడాదిపాటు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, రెండు మూడు రకాల పండ్లు పండించుకోవచ్చు. ప్రస్తుతం నగరవాసులు తాజా కూరగాయలు, ఆకుకూరల కోసం సొంత సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 వేల ఇళ్లలో అర్బన్ ఫార్మింగ్ జరుగుతోంది. వాస్తవానికి నగరంలో దాదాపు 22 లక్షల ఇళ్లలో ఇంటిపంటకు అవకాశం ఉండగా, కేవలం 40వేల ఇళ్లలో మాత్రమే రూఫ్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ జరుగుతోంది. అయితే, దేశంలో ఇంటిపంటల నిర్వహణలో కేరళ, కర్ణాటక తర్వాత మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉండటం విశేషం. కొచ్చిన్, త్రివేండ్రమ్ వంటి నగరాల్లో ఇంటిపంటలను తప్పనిసరి అవసరంగా చాలామంది గుర్తించి ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా సొంత సాగు దిశగా పయనిస్తోంది.
హైదరాబాద్ ఎంతో అనుకూలం...
ఇంటిపంటలకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైన నగరం. సగటున 40 డిగ్రీల గరిష్ట, 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన నగర వాతావరణంలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగుచేసుకోవచ్చు. నగరంలో ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 3వేల టన్నుల ఆకుకూరలు, కూరగాయలతోపాటు 100 టన్నుల పండ్లు వినియోగమవుతున్నాయి. పోషకాహార నిపుణుల అంచనా ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు అవసరం. దాదాపు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న గ్రేటర్ భూభాగంలో నగర అవసరానికి సరిపడా ఇంటి పంటలు పండించుకోవడం ఏమాత్రం కష్టం కాదు. నగరంలో సుమారు 22 లక్షల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో సుమారు 14,824 ఎకరాల సాగు స్థలాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం సగం స్థలంలో ఇంటిపంట సాగుచేసినా నగర ప్రజల కూరగాయల అవసరాలు తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం 40వేల ఇళ్లలో సాగుతున్న రూఫ్ గార్డెనింగ్ స్థలాన్ని లెక్కిస్తే అది కనీసం వంద ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంటిపంటల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారిని సొంత సాగు దిశగా ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇంటిపంట కిట్లను రాయితీపై అందజేస్తున్న ఉద్యానశాఖ.. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతోంది. మరోవైపు సహజ ఆహారం వంటి స్వచ్చంద సంస్థలు, పలువురు ఆర్గానిక్ ఆహార ప్రియులు సైతం ఇంటిపంటను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
రాయితీ పై అర్బన్ ఫార్మింగ్...
ఇంటిపంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవనశాఖ గత ఐదేళ్లుగా అర్బన్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రూఫ్ గార్డెన్, కిచెన్ గార్డెన్ సామగ్రిని రాయితీపై అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 500 మందికి వీటిని అందజేసినట్లు ఉద్యానవనశాఖ అధికారి మధుసూధన్ ‘సాక్షి’తో చెప్పారు. 50 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగుల గరిష్ట స్థలం అందుబాటులో ఉన్న నగరవాసులు అర్బన్ ఫార్మింగ్ పథకానికి అర్హులు. ఈ పథకంలో కూరగాయలు పెంచేందుకు అవసరమైన సిల్ఫాలిన్ కవర్లు (మొక్కలు నాటేందుకు కావాల్సినవి), మట్టి మిశ్రమం, విత్తన సంచి, వేపపిండి, వేపనూనె, పనిముట్లు అందజేస్తారు. సాధారణంగా ఈ కిట్ ధర రూ.6వేలు కాగా, ఉద్యానవనశాఖ 50 శాతం రాయితీతో రూ.3వేలకే అందజేస్తోంది. ఇంటిపంట పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఉద్యానవనశాఖ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్‌కార్డు, పాస్‌ఫోర్ట్‌సైజ్ ఫొటోతోపాటు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి కిట్ పొందవచ్చు. అందులో 40 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల లోతు ఉన్న 4 సిల్ఫాలిన్ కవర్లు, 52 ఘనపు అడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువుతో కూడిన 20 పాలీ బ్యాగులు, 12 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు, 25 కిలోల వేపపిండి, 500 మిల్లీలీటర్ల వేపనూనె ఉంటుంది. సాగు ఉపకరణాలతోపాటు షవర్, చేతి సంచి కూడా లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment