
భీమ్‌గల్‌లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
యూరియా కొరత ఏర్పడడానికి కారణం డీలర్లు, అధికారులేనా..? అందుకే సరిపడా యూరియా రావడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అందజేసిన పీవోఎస్ మిషన్లను వాడక పోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం. ఈ మిషన్లు వాడి ఉంటే యూరియా వినియోగం ఏ స్థాయిలో ఉంది.. ఇంకా ఎంత స్టాక్ నిల్వ ఉందనే వివరాలు కేంద్రానికి చేరుతాయని, తద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు స్టాక్‌ను కేటాయిస్తుందని తెలిసింది.
సాక్షి, నిజామాబాద్: యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం జిల్లాకు నామమాత్రంగా 1740 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఆగస్టు నెల నాటికి 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా రావడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న 18,437 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ను సరఫరా చేసి సర్దుబాటు చేశారు. వర్షాలు ఆగస్టు మాసంలో కురవడంతో జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా వేశారు. సాధారణం కంటే 15 శాతం వరకు అధికంగా వరి సాగైంది. దీంతో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. మరోవైపు, యూరియా కొరతకు అధికారులు, వ్యాపారులే కారణమని తెలుస్తోంది. పీవోఎస్ మిషన్లను వాడకపోవడం వల్లే కేంద్రం రాష్ట్రానికి తగినంత యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం.
పెరిగిన సాగు విస్తీర్ణం.. తగ్గిన సరఫరా
జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అదనంగా 30 వేల (15శాతం) ఎకరాల వరకు అదనంగా సాగైంది. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఆగస్ట్ 15 వరకూ వరి నాట్లు వేశారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 38 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక పంపించగా, సుమారు 16 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగి, వినియోగం పెరగడంతో యూరియా కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం 2014–15 సంవత్సరం నాటి బఫర్ స్టాక్‌ను సర్దుబాటు చేసింది. ప్రస్తుతం ఆ బఫర్ స్టాక్ నిల్వలు కూడా నిండుకున్నాయి.
1740 మెట్రిక్ టన్నులు మాత్రమే..
యూరియా కొరత విపరీతంగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా సరఫరా కావడం లేదు. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఈ యూరియా ప్రస్తుతమున్న డిమాండ్‌కు ఏ మాత్రమూ సరిపోదు. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వరి నాట్లు ఆలస్యంగా వేయడంతో ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ నెలలోనే యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాడకపోవడం వల్లే..?
యూరియా వినియోగం విపరీతంగా పెరగడంతో కేంద్రం గతంలో పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌ఫుట్ డీలర్లు, సొసైటీలకు మిషన్లను అందజేసి, వాటిపై శిక్షణ కూడా ఇప్పించింది. యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, వేలిముద్రలు పెట్టి తీసుకెళ్లాలి. తద్వారా యూరియా ఎంత వినియోగమవుతోంది.. ఒక రైతు ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నాడు.. అనే వివరాలు కేంద్రం దృష్టికి వెళ్తాయి. కానీ పీవోఎస్ మిషన్లను వాడక పోవడంతో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్రంలో ఎరువుల వినియోగంపై స్పష్టత రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం.
అందుబాటులో ఉంచాలి..
నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. యూరియా దొరు కుతదో.. లేదోనని ఆందోళన చెందుతున్నాం. గడ్డలు కట్టిన యూరియా కాకుండా సన్నంగా ఉండే యూరియాను సరఫరా చేయాలి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.
– బండమీది మహేష్, రైతు, మోపాల్
రెండ్రోజుల్లో వస్తుంది..
జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– ఎం గోవిందు, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment