తారామతి, ప్రేమామతి సమాధుల వద్ద భారత్‌లోని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్
సాక్షి, హైదరాబాద్: తారామతి, ప్రేమామతి సమాధులు కొత్తందాలను సంతరించుకున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిగేల్‌మంటున్నాయి. లక్షా మూడు వేల యూఎస్ డాలర్లతో సుందరీకరించిన ఈ రెండు సమాధులను భారత్ లోని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్ చేతు ల మీదుగా మంగళవారం పర్యాటకులకు అంకి తం చేశారు. ఈ సందర్భంగా జస్టర్ మాట్లాడు తూ.. ఆగాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో 17వ శతాబ్దపు కులీకుతుబ్‌షాహీ రాజుల సమాధుల సుందరీకరణ పనులకు తమ ప్రభు త్వం ఏటా నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రపంచం లోని చారిత్రక కట్టడాలను వారసత్వ సంపదగా భావితరాలకు అందించడానికే ఈ సాయం చేస్తున్నామన్నారు. ‘గతంలోనూ ఆగాఖాన్ ఫౌండేషన్‌కు లక్షా ఒక వేయి డాలర్లను ఇచ్చాం. సుందరీకరణ పనులు ఊహించిన దానికంటే గొప్పగా జరుగుతున్నాయి’అని ఆయన ప్రశంసించారు. కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణ పను లు కూడా పూర్తయితే ఇక్కడ ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటుందన్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర పురాతత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రితీష్‌నంద, సైట్ అధికారి గణేష్‌రెడ్డి తదితరులున్నారు.
వెన్నెల రాత్రుల్లో అక్కాచెల్లెళ్ల నృత్యం
అక్కాచెల్లెళ్లయిన తారామతి, ప్రేమామతి.. చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ ఆస్థానంలో నృత్యకారిణులు. మంచి అభినయంతో, అందమైన గాత్రాలతో వినసొంపుగా పాడేవారు. ఇవి రాజులను మంత్రముగ్ధులను చేసేవి. వీరి ఆటపాటలకు వీలుగా తారామతి బారాదరిలో నృత్య వేదికలను నిర్మించారు. బారాదరి.. రెండంతస్తులతో, చదరపు ఆకారంలో అన్నివైపులా బలమైన తోరణాలతో, చక్కని శబ్దగ్రాహ్యతతో కూడిన విలక్షణమైన నిర్మాణం. గోల్కొండ కోటకు సమీపంలోనే ఇది ఉంది. నృత్య ప్రదర్శనల సందర్భంలో బారాదరి – గోల్కొండ కోటను కలుపుతూ తీగలను అనుసంధానించే వారు. వాటిపై తారామతి, ప్రేమామతి వెన్నెల రాత్రుల్లో నృత్యాలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు. మరణానంతరం వీరిద్దరిని ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్‌షాహీల రాజ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ రెండు సమాధులు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం వీటినే సుందరీకరించి, పర్యాటకుల సందర్శనకు వీలుగా అంకితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment