నిరసనలకు లిమిటెడ్ కంపెనీయే వెళుతోంది
హైదరాబాద్ : సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తనను పిలవటం లేదని ఆయన అన్నారు. కొంతమంది నేతలే లిమిటెడ్గా ఏర్పడి నిరసన కార్యక్రమాలకు వెళుతున్నారని వీహెచ్ శుక్రవారమిక్కడ ఆరోపించారు.
ఆ కార్యక్రమాలకు లిమిటెడ్ కంపెనీ వాళ్లే వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిరసన కార్యక్రమాలకు భట్టి విక్రమార్క వంటి నేతలనే పిలవటం లేదన్నారు. తాను కూడా రమ్మని పిలిస్తే పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలకు హాజరయ్యేవాడినని వీహెచ్ అన్నారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రచారానికే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.